ఎస్సై ఆత్మహత్య మిస్టరీ: సూసైడ్ నోట్ రాసింది అతనేనా, ఎమ్మెల్యేపై ఆరోపణలు
కరీంనగర్: పెద్దపల్లి ఎస్సై జగన్మోహన్ ఆత్మహత్య మిస్టరీగా మారింది. రాజకీయ ఒత్తిళ్లు, వరుస బదిలీలే జగన్మోహన్ ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సూసైడ్ నోట్‌ను తొలుత గోప్యంగా ఉంచారు. అయితే, ఆ తర్వాత సూసైడ్ నోట్‌లో ఉన్న విషయాలపై వార్తాకథనాలు రావడం ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి పోలీస్‌క్వార్టర్స్‌లో ఎస్సై జగన్మోహన్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తన సర్వీస్ రివాల్వర్‌తో కణతకు గురిపెట్టుకుని పాయింట్ బ్లాక్ రేంజ్‌లో కాల్చుకున్నారు. ఇంట్లో కుటుంబసభ్యులందరూ ఉండగానే తన గదిలో జగన్మోహన్ ప్రాణాలు తీసుకున్నారు. కొంతకాలంగా పెద్దపల్లి ఎస్సైగా పనిచేస్తున్న జగన్మోహన్‌ను వారం కిందట జమ్మికుంటకు బదిలీ చేశారు. నిజానికి తన పనితీరుకు, సీనియారిటీకి సీఐగా ప్రమోషన్ వస్తుందని జగన్మోహన్ భావిస్తూ వచ్చారని అంటారు.అయితే అధికారులు అనూహ్యంగా బదిలీ చేయడాన్ని తట్టుకోలేకపోయాడని, అందుకే ఆయన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.జగన్మోహన్ ఆత్మహత్యకు రాజకీయ ఒత్తిళ్లే కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. ప్రమోషన్ లిస్టులో ఉన్న జగన్మోహన్‌ను బదిలీ చేయాలంటూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ ఎల్.రాజయ్యతో పాటు ఓ ఎస్‌ఐ, సీఐ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. జగన్మోహన్ మృతదేహానికి హడావుడిగా పోస్టుమార్టం నిర్వహించడంపై కూడా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎస్సై రాశాడంటూ చెబుతున్న సూసైడ్ నోట్ ఎంతవరకు నిజం అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. కాగా, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఆయన తమ్ముడి వేధింపుల వల్లే ఎస్‌ఐ జగన్‌మోహన్ ఆత్మహత్య చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ నేత విజయరమణారావు ఆరోపించారు. ఎస్ఐ జగన్‌మోహన్ రాసిన సూసైడ్ నోట్‌ను వారిద్దరూ మార్చే ప్రయత్నం చేస్తున్నారని విజయరమణారావు అన్నారు. ఎమ్మెల్యే మనోహర్‌పై హత్య కేసు నమోదు చేయాలి ఆయన డిమాండ్ చేశారు. ఈ సమాజంలో నీతి నిజాయితీతో బతికే అవకాశం లేదని, పోలీసుల దగ్గర డబ్బులు తీసుకుని పోస్టింగులు ఇవ్వాలని సిఫార్సు లేఖలు ఇస్తున్నారని విజయరమణారావు ఆవేదన వ్యక్తం చేశారు.