ఏజెన్సీలో స్వారీ చేస్తున్న చలిపులి
కనిష్ట ఉష్ణోగ్రతల నమోదుతో వణుకు
జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు
ఆదిలాబాద/వరంగల్,డిసెంబర్3 (జనం సాక్షి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. పగటిపూట వాతావరణంలోనూ అనూహ్య మార్పులు సంభవించాయి. మధ్యాహ్నం 12గంటలు దాటినా చలి ప్రభావం తగ్గక పోవడంతో పొలం పనులకు వెళ్లే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం రాష్ట్రంలోనే అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరి గ్రామంలో 12.7నమోదు కావడం విశేషం. వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ చలిపులి స్వారీ చేస్తోంది.చలికి తోడు ఈదురుగాలులు వీస్తుండడంతో వృద్ధులు, చిన్న పిల్లలు, శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. రాత్రి 12గంటల వరకు మాములుగానే చలి తీవ్రత కన్పిస్తున్నా 12 నుంచి తెల్లవారి 9గంటల వరకు తీవ్రత అధికంగా ఉంటోందని ఏజెన్సీ గ్రామాలకు చెందిన రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం పత్తి ఏరివేత సీజన్ మొదలైన పరిస్థితుల్లో చలి వల్ల ఉదయం పూట పనులకు వెళ్లలేని పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు. వారం రోజులుగా స్వల్పంగా ప్రభావం చూపిన చలి వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో ఏజెన్సీ మండలాలు చలి గుప్పిట గజగజ వణుకుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి యేటా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. గతంలో కూడా మైనస్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయిన రికార్డు ఉండడంతో ఈ సారి పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం బెంబేలెత్తుతున్నారు. కొవిడ్ పెరిగిన పరిస్థితుల్లో ఈ సారి కూడా అలాంటి పరిస్థితి పునరావృతం అయితే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అటు వైద్యనిపుణులు హెచ్చరి స్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చర్మ సంబంధం అయిన అలర్జీలతోపాటు దగ్గు, జలుబు వంటి లక్షణాలతో కూడిన అనారోగ్యం బారిన పడే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తంలో ఇస్నోఫిలియా శాతం పెరిగి అలర్జీల బారినపడే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. చలితో పాటు పొడిగాలులు వీస్తుం డటంతో చర్మ సంబంధిత సమస్యలు కూడా గురయ్యే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. తగినన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువగా చలిలో తిరగకుండా వెచ్చటి వాతావరణంలో ఉండేలా జాగ్రత్తపడాలని అత్యవసర పనులపై బయటికి వస్తే చెవి, ముక్కుకు రక్షణ కల్పించేట్టు దుస్తులు ధరించాలని చెబుతున్నారు. అలాగే చర్మ సంబంధిత సమస్యలు రాకుండా పెట్రోలియం జెల్లి వంటి క్రీములను ఉపయోగించాలని, శరీరంపై వీలైనంత తేమ ఉండేలా చూసుకోవాలని వైద్యులు చెబతున్నారు. ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలు నెగళ్లు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. పలుచోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు పేర్కొంటున్నారు.