*ఏజెన్సీ మండలంలో రియల్ దందా*

*•గిరిజనుల పేరుతో గిరిజనేతరులు ఇష్టారాజ్యంగా భూ వ్యాపారం*
*•భూ దందాలో గిరిజన, గిరిజనేతర నాయకులు కుమ్మక్కు*
బయ్యారం,సెప్టెంబర్07(జనంసాక్షి):
ఆదివాసీ, గిరిజన చట్టాలతో గిరిజనులకు న్యాయం జరిగే మాట  ప్రక్కన పెడితే గిరిజనేతరులు తీవ్ర ఇబ్బందులకు, అన్యాయాలకు గురవుతున్న సందర్భాలు ఏజెన్సీ మండలాల్లో చోటు చేసుకుంటున్నాయి.దోపిడీ వ్యవస్థ లో,నిరంకుశ పాలనలో ఆదివాసీ, గిరిజన ప్రజల మనోభావాలు దెబ్బతినడంతో వారి ఆర్థిక- సామజిక ఎదుగుదలకు, సమాజంలో వారి మనుగడకు ఆటంకాలు ఏర్పడకుండా రాజ్యాంగం సాక్షిగా ఏర్పడిన చట్టమే 1/70 ఏజెన్సీ చట్టం.కానీ కొన్ని సందర్భాలు, కొందరు వ్యక్తుల వల్ల ఈ చట్టం నీరుగారే పరిస్థితులు ఏర్పడ్డాయి.సరిగ్గా ఇదే కోవలో ఏజెన్సీ మండలం అయిన బయ్యారం కొట్టు మిట్టాడుతుంది.ఏజెన్సీ చట్టం 1/70 వల్ల బయ్యారం అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినపడుతుంది.సమాజంలో ఆదివాసీ,గిరిజనుల సమానత్వం కోసం,వారి మనుగడ,గిరిజనుల సామజిక అభివృద్ధి కోసం,ఆదివాసీ,గిరిజనుల ఆర్థిక అసమానతలు రూపు మాపడం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చట్టమే ఈ 1/70 యాక్ట్.అంత గొప్ప చట్టం ఇప్పుడు కొందరు అక్రమార్కుల వల్ల పక్కదారి పడుతుందని చెప్పక తప్పట్లేదు. బయ్యారం లో కొందరు గిరిజన నాయకులు గిరిజనేతర భూ వ్యాపారులతో కలిసి రాజకీయ పలుకుబడితో బయ్యారం మండలం కేంద్రంలో భూములను ఎకరం 50-70 లక్షలతో కొనుగోలు చేసి ఏజెన్సీ ప్రాంతంలో చట్ట విరుద్ధమైన లేఔట్ ప్లాట్లు చేసి మరీ కోట్లు గడిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు.కొందరు స్వార్ధ భూ వ్యాపారులు గిరిజనులను అడ్డుపెట్టుకొని ఏజెన్సీ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తూ దందా చేయడం గమనార్హం.ఏజెన్సీ ప్రాంతంలో బహుళ అంతస్తు భవన నిర్మాణాలు చేయడం కూడా చట్ట విరుద్ధమే అయినా మరికొందరు సంపన్న వర్గ గిరిజనులే చట్టాన్ని ఉల్లంఘించి 4 అంతస్తుల నిర్మాణాలు చేపట్టినా పట్టించుకున్న నాథుడే లేరు.ఇలా చేపట్టిన నిర్మాణాలను ఏ అధికారులు అడ్డు చెప్పకపోయేసరికి ఒకరిని చూసి మరొకరు పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తున్నారు.ఇదంతా నాణేనికి ఒక వైపు కాగా…గిరిజనులతోనే సహజీవనం చేస్తున్న గిరిజనేతరులు మాత్రం బండ కింద పడిన చేయి తీరుగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండలేక,పుట్టిన ఊరిని విడిచి వెళ్ళలేక అగమ్యగోచర జీవనం సాగిస్తున్నారు.కొందరు గిరిజనులు చేస్తున్న బహుళ నిర్మాణ కట్టడాలుగానీ,స్థల విక్రయాలు గానీ  గిరిజనేతరులు చేస్తే వెంటనే తిరిగి అదే కొందరు సంపన్న వర్గ గిరిజన నాయకులు ఉదేశ్యపూర్వకంగా గిరిజన చట్టాల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయిస్తున్నారని గిరిజనేతరులు వాపోతున్నారు.ఇప్పటికే తమ పిల్లలకు ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల కేటాయింపులో రిజర్వేషన్లు ఒక వైపు,ఏజెన్సీ చట్టంతో మరోవైపు కోతలే తప్ప తమ పిల్లల తలరాతల్లో మార్పు లేదని ఆవేదన వ్యక్తమవుతుంది.ఇదిలా ఉండగా దశబ్దాలు గడుస్తున్నా, ఏజెన్సీ మండలాల్లో ఆదివాసీలు, గిరిజనులు అభివృద్ధి చెందుతున్నా చట్టాల్లో ఎటువంటి సవరణ చేయకపోవడంతో గిరిజనేతరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఓట్ల విషయంలో గిరిజన, గిరిజనేతరుల ఓట్లు కావాల్సిన నాయకులు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు ఏ సమస్య వచ్చినా ఇది ఏజెన్సీ ప్రాంతం అని, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు తప్ప ఇతరులకు ఎటువంటి హక్కులు ఉండవని గిరిజనేతరులకు అధికారులే అడ్డుపడే పరిస్థితులు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరుల పాలిట  శాపంగా మారిపోయింది.అటు బయ్యారంలో అభివృద్ధి అడ్డుకట్టకి పరోక్షంగా ఏజెన్సీ చట్టాలే కారణమని కొందరి వ్యక్తిగత అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.ఉపాధి కల్పనలో,రాజకీయాలలో, ఉద్యోగావకాశాలలో,బ్యాంకు లోన్ల విషయంలో అన్నింటిలో గిరిజనేతరులకు అధికారులు, నాయకులు ఏజెన్సీ ప్రాంతంలో మొండిచేయి చూపెడుతూనే ఉన్నారు.డిగ్రీలు,పీజీలు చదివినా నిరుద్యోగ సమస్యలతో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగం పొందలేని గిరిజనేతరులు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్నా అనుమతులకు  ఏజెన్సీ చట్టాలు అడ్డుపడుతున్నాయని కొందరు నిరుద్యోగులు తమగోడు వెళ్ళబోశారు.కానీ ఇదంతా తెలియని అమాయకపు ఏజెన్సీ గిరిజన,ఆదివాసీ బిడ్డలు తమకు జరిగే నష్టాన్ని,తమపేరుతో కొందరు చేసే దందాలను గ్రహించలకేపోతున్నారు.కాగా ఇప్పటికే పలువురు ఏజెన్సీ చట్టాల సవరణ కొరకు పలువురు డిమాండ్ చేస్తున్నారు.ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజనేతరులకు ఆదివాసీ, గిరిజనులతో సమాన హక్కులు కల్పించాలనే వాదనలూ వినిపిస్తున్నాయి.రాష్ట్రంలోని షెడ్యూల్డ్‌ ప్రాంతాలను రీషెడ్యూల్‌ చేయాలని, అధికారుల తప్పిదాల మూలంగా షెడ్యూల్డ్‌ ప్రాంతాల విభజనలో అనేక అవకతవకలు జరిగాయని,వాటిని సరిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన అవకాశం మేరకు ఏజన్సీ ప్రాంతాలను బైపర్‌కేషన్ చేయాలని రాష్ట్ర హైకోర్టులో రిట్‌ఫిటిషన్(ఫిల్‌) దాఖలు చేశారు.కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా పేర్కొంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏజన్సీ ప్రాంతాల రీషెడ్యూలింగ్‌ ప్రతిపాదనలు కోరుతూ కేంద్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వశాఖ 2014 డిసెంబరు 1న తెలంగాణ,ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రిన్సిపల్‌ సెక్రటీరీలు(గిరిజన సంక్షేమ శాఖ) ప్రధానకార్యదర్శులకు ఎఫ్‌నెంబరు18014/01/2014 సీఅండ్‌ఎల్‌ఎం-1 ద్వారా ఆదేశాలు జారీ చేసింది.ఈమేరకు తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ సైతం ఆర్‌సీనెంబర్‌ 045/2014 టీఆర్‌ఐ/ఎస్‌ఎ తేది 25-2-2015 ద్వారా షెడ్యూల్డ్‌ ప్రాంతాల బైపర్‌కేషన్ కు సంబంధించిన ప్రతిపాదనలు పంపవల్సిందిగా ఏజన్సీ ప్రాంతాల జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినప్పటీకీ రీషెడ్యూల్‌ జరగలేదని పిటిషనర్‌ న్యాయస్ధానం దృష్టికి తీసుకెళ్లారు.గత 50 సంవత్సరాల క్రితం జరిగిన షెడ్యూల్‌ ప్రాంతాల ఏర్పాటులో అప్పటి అధికారులు ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేకుండా అశాస్త్రీయంగా షెడ్యూల్‌ ప్రాంతాలను గుర్తించారని ఫలితంగా గిరిజనులు, గిరిజనేతరులు తీవ్రంగా నష్టపోయారని ఫిటిషనర్‌ న్యాయస్ధానానికి వివరించారు. షెడ్యూల్డ్‌ ఏరియాల గుర్తింపులో అధికారుల తప్పిదాల మూలంగా గిరిజన జనాభా 50శాతం మించి ఉన్న గ్రామాలు, పట్టణాలను నాన్ షెడ్యూల్డ్‌ ప్రాంతాలుగా, 20శాతం కూడా గిరిజన జనాభాలేని గ్రామాలను షెడ్యూల్డ్‌ ప్రాంతాలుగా గుర్తించారని, 50శాతం పైగా గిరిజనేతరులున్న ప్రాంతాలను షెడ్యూల్డ్‌ ప్రాంతాలుగా పేర్కొనడం వలన ఆ ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర కష్టనష్టాలకు గురవుతున్నట్లు పిటిషనర్‌ న్యాయస్ధానం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల్లో పునర్విభజన తరుణంలో తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు షెడ్యూల్డ్‌ ప్రాంతాలను రీషెడ్యూల్‌ చేసుకునేందుకు ప్రతిపాదనలు పంపాలని కేంద్ర ప్రభుత్వం కోరడం, షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో జనాభాను పరిగణలోకి తీసుకోని ప్రతిపాదనలు ఇవ్వాలని కోరినప్పటీకీ నేటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రీషెడ్యూల్‌పై చర్యలు చేపట్టకపోవడం వలన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 244, 5వషెడ్యూల్‌ ఆర్టికల్‌ 300ఎ ప్రకారం సహజన్యాయానికి  అందువలన  కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని ఫిటిషనర్‌ తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్ధానాన్ని అభ్యర్థించారు.ఇక కాలమే నిర్ణయించాలి రానున్న రోజుల్లో భావి తరాలకైనా రిజర్వేషన్లనుండి,ఏజెన్సీ కోరల నుండి విముక్తి దొరుకుతుందో లేదో వేచి చూడాలి.