ఏదైనా ఒకటి ఇవ్వండి: సోనియాతో డిఎస్ భేటీ
న్యూఢిల్లీ: తనకు ఏదైనా ఒక పదవి ఇవ్యాలని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై చర్చించడానికి ఆయన శనివారం సోనియా గాంధీని కలిశారు. తనకు నాలుగు పదవుల్లో ఏదైనా ఒక్కటి ఇవ్వాలని ఆయన సోనియాకు విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. నాయకత్వ మార్పు చేస్తే ముఖ్యమంత్రి పదవి గానీ, పిసిసి అధ్యక్ష పదవిగానీ తనకు ఇవ్వాలని డిఎస్ అడిగినట్టు చెబుతున్నారు. లేదంటే, పార్టీలో అత్యున్నత నిర్ణాయక సంస్ధ అయిన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్య్లుసి)లో స్ధానం కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. గతంలో ఇందులో సీనియర్ నేత జి.వెంకటస్వామి, కె కేశవరావు ఉండేవారు. వారి స్ధానంలో తనను తీసుకోవాలని ఆయన సోనియాను కోరినట్లు చెపుతున్నారు. ఇకపోతే, తెలంగాణ సమస్య పరిష్కారానికి త్వరలో ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేస్తే దానికి ఛైర్మన్‌గా తనను నియమించే విషయాన్ని పరిశీలించాలని డిఎస్ సోనియాకు విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు. చట్టబద్దతతో కూడిన తెలంగాణ ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేయాలని కాంగ్రెసు అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇదిలావుంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్రలపై డిఎస్ సోనియాకు వివరించినట్లు చెబుతున్నారు. అలాగే, వైయస్ జగన్ జైలులో ఉన్నప్పటికీ జరుగుతున్న వలసలపై ఆయన సోనియాకు చెప్పినట్లు సమాచారం. తెలంగాణపై ప్రకటన చేయకపోతే కాంగ్రెసు పార్లమెంటు సభులు, శాసనసభ్యులు తెరాసలో చేరుతారనే ఊహగానాలపై ఆయన సోనియాతో చర్చించినట్లు చెబుతున్నారు. మొత్తంగా, రాష్ట్రంలోని తాజా పరిణాలపై ఆయన సోనియాకు వివరించినట్లు సమాచారం.