ఏపీలో జనవరిలో మెగా డీఎస్సీ..

– అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి సురేష్‌

అమరావతి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : ఏపీలో నిరుద్యోగులకు జగన్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చాడు. రాష్ట్రంలో 7900పోస్టులతో డీఎస్సీ ఉంటుందని తెలిపారు. ఈ మెగా డీఎస్సీ వచ్చే నెలలో (జనవరి 2020) నిర్వహిస్తామంటున్నారు. మెగా డీఎస్సీపై మంత్రి ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ కూడా ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో వివిధ శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పక్రియ చేపడతామని.. వచ్చే జనవరిలో నోటిఫికేషన్‌ ఇస్తామని తెలిపారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీగా ఉంచే ప్రసక్తే లేదని.. జనవరి నెల సవిూపిస్తున్నందున నిరుద్యోగులంతా సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పుడు చెప్పినట్లుగానే మెగా డీఎస్సీకి సిద్ధమవుతున్నారు. ఇటు జగన్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. గ్రామవాలంటీర్‌, వార్డ్‌ వాలంటీర్‌, గ్రామ సచివాలయ ఉద్యోగాలతో పాటు అంగన్‌వాడీ, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దీంతో నిరుద్యోగులకు వరుసగా శుభవార్త అందిస్తోంది. తాజాగా మెగా డీఎస్సీ ప్రకటనతో నిరుద్యోగులు ఆనందంతో ఉన్నారు.