ఏపీ ప్రజలపై జగన్‌ వరాలజల్లు

– ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం

– ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు

– 45ఏళ్లు దాటిన కాపు మహిళలకు రూ.15వేలు

– వైఎస్‌ఆర్‌ కాపునేస్తం పథకానికి రూ. 1101కోట్లు కేటాయింపు

– పేదలకు ఇళ్లకు పట్టాల పంపిణీకి నిర్ణయం

– కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పేర్నినాని

అమరావతి, నవంబర్‌27(జనం సాక్షి) : ఏపీ ప్రజలకు సీఎం జగన్మోహన్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. బుధవారం జరిగిన ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. వైఎస్సార్‌ నవశకం కొత్త మార్గదర్శకాలకు, జగనన్న వసతి దీవెన పథకం, కాపు నేస్తం పథకాలకు ఆమోద ముద్ర వేసింది. కొత్త పెన్షన్‌ కార్డులు, పెన్షన్‌ అర్హతల మార్పు, రైస్‌ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు, విద్యా దీవెన కార్డుల జారీ, వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, సీఆర్డీఏలో జరుగుతున్న పనుల నిర్మాణాలపై, కొత్త బార్‌ పాలసీపై కేబినెట్‌లో చర్చసాగింది. ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు ఆర్థిక సాయం, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ. 15 వేల ఆర్థిక సాయం, డిగ్రీ ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు

ఏడాదికి రూ. 20 వేలు ఆర్థిక సాయం చేసేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకానికి రూ.1101కోట్లు కేటాయింపులు చేస్తూ నిర్ణయించారు. ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయం అందజేయాలని, 45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో రూ.75వేలు అందజేతకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నవశకం సర్వే ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు. కడప ఉక్కు పరిశ్రమకు ముడిసరుకు కోసం ఎన్‌ఎండీసీతో ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జమ్మలమడుగు మండలం పెదదండ్లూరు వద్ద 3,200 ఎకరాల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీఎస్‌పీడీసీఎల్‌ను విభజించి సెంట్రల్‌ పవర్‌ డిస్టిబ్యూష్రన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ పథకాలకు వేర్వేరు కార్డుల జారీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రేషన్‌ కార్డుకు అర్హతలు మార్పు చేయనున్నారు. 2,50,000 వార్షిక ఆదాయం, 10 ఎకరాలలోపు మాగాణి, 25 ఎకరాలలోపు మెట్ట ఉన్నవారు అర్హులుగా కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. జగనన్న వసతి దీవెన కింద రూ.2300కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద రూ.3400కోట్లు కేటాయింపు చేసేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఒప్పంద ఉద్యోగుల అంశంపై కమిటీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తితిదే పాలకమండలి సభ్యుల సంఖ్య 19నుంచి 29కి పెంపు చేస్తూ నిర్ణయం తీసుకుంది.