ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల రాజీనామా

చంద్రబాబుకు లేఖను పంపిన పరకాల
తక్షణమే ఆమోదించాలని వినతి
నా కారణంగా విూ చిత్తశుద్దిని ఎవరూ శంకించకూడదు
నా కుటుంబంలోని వ్యక్తులు వేరొక పార్టీలో ఉన్నారు
దానిని ఆసరా చేసుకొని ప్రతిపక్ష నాయకుడు విూ పోరాటాన్ని శంకిస్తున్నారు
అందుకే రాజీనామాను అందిస్తున్నా
లేఖలో పేర్కొన్న పరకాల
పరకాల రాజీనామా ఆమోదించమని సీఎంవో స్పష్టీకరణ
ఏవరో ఆరోపణలు చేస్తే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు
మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
అమరావతి, జూన్‌19(జ‌నం సాక్షి ) : ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన మంగళవారం లేఖ రాశారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని విన్నవిస్తూ లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా కారణాలను పరకాల లేఖలో పేర్కొన్నారు. కాగా పరకాల రాజీనామాను సీఎం చంద్రబాబు నాయుడు తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఎవరో ఆరోపణలు చేస్తే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నట్లు సమాచారం. దీనికనుగుణంగానే రాజీమా లేఖ అందిన వెంటనే పరకాల రాజీనామా ఆమోదించమని సీఎంఓ స్పష్టం చేసింది. ఎవరో ఆరోపణలు చేస్తే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ పరకాల రాజీనామాను ప్రభుత్వం ఆమోదించేందుకు సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అంటే పరకాల రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నిర్మలా సీతారామన్‌ సమర్థించగా.. విశాలాంధ్ర మహాసభ పేరిట సమైక్య ఉద్యమాన్ని పరకల నడపలేదా? అని, ఈ విషయం ప్రతిపక్ష నేతలకు తెలియదా అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు.
పరకాల లేఖలో వివరాలు..
విపక్షానికి చెందిన కొంతమంది నాయకులు నేను ప్రభుత్వంలో సలహాదారు బాధ్యతల్లో ఉండడాన్ని పదేపదే ఎత్తి చూపుతున్నారని పరకాల తన లేఖలో పేర్కొన్నారు. కేంద్రంపై, బీజేపీపై జరుగుతున్న ధర్మ పోరాటం విూద ప్రజలలో అనుమానాలు లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రభుత్వంలో నా ఉనికిని, విూ చిత్తశుద్ధిని శంకించడానికి వాడుకుంటున్నారని పరకాల లేఖలో పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుని స్థానంలో ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కూడా అదే విషయాన్ని లేవనెత్తి విూరు చేస్తున్న పోరాటాన్ని శంకించేలా మాట్లాడారని, నా వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలకు, రాజకీయ ప్రయోజనాలనూ, ప్రాతిపదికనూ ఆపాదించ పూనుకోవడం.. వాటిని తెరవెనుక మంతనాలకు బేరసారాలకూ విూరు వినియోగిస్తారని ఆరోపించడం ప్రతిపక్ష నాయకుల నీచ స్థాయి ఆలోచనలకు తార్కాణమన్నారు. నా కుటుంబంలోని వ్యక్తులు వేరొక పార్టీలో ఉన్నందు వల్ల.. నాకన్నా భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందు వల్ల మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీ పడతానని కొందరు ప్రచారం చేయడం చాలా బాధిస్తోందన్నారు. పరిణతి చెందిన వ్యక్తులు ఎవరి రాజకీయాభిప్రాయాలకు వారు నిబద్ధులై ఉండగలరని, వారివారి అభిప్రాయాల పట్ల వారికున్న అంకితభావానికి బాంధవ్యాలు అడ్డు రాలేవనే ఇంగితం కూడా వీరికి భగవంతుడు ప్రసాదించకపోవడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా నూతన రాష్టాన్రికి సేవ చేసుకునే భాగ్యాన్ని కలుగ చేసినందుకు నేను విూకు సర్వదా కృతజ్ఞుడనై ఉంటానని ఆ లేఖలో పరకాల పేర్కొన్నారు. త్వరలోనే వచ్చి మిమ్మల్ని కలుస్తానని ముగించారు. కేబినెట్‌ సమావేశానికి ముందే పరకాల రాజీనామా నిర్ణయం షాకిచ్చింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త అయిన పరకాల ప్రభాకర్‌ ఏపీ ప్రభుత్వానికి విూడియా సలహాదారుగా ఉన్నారు. అయితే ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగిన తర్వాత కూడా పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. కొద్దిరోజులుగా దీనిపై వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి. అలాగే ప్రతిపక్ష నేత జగన్‌ కూడా ఇదే అంశాన్ని టార్గెట్‌ చేయడంతో.. పరకాల రాజీనామా నిర్ణయానికి వచ్చారనే ప్రచారం జరుగుతోంది.
రాజీనామా బీజేపీ వ్యూహమా?
పరకాల రాజీనామా లేఖ వెనుక బీజేపీ వ్యూహం కూడా ఉండి ఉండవచ్చునిన పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పరకాల ప్రభాకర్‌ గత నాలుగేళ్ల నుంచి  ఏపీ ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటున్నారు. చంద్రబాబుకు నమ్మకస్తుడిగా ఉంటూ వస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో పరకాల కీలక భూమిక పోషిస్తూ వస్తున్నారు. వచ్చే నెల జులై 4న పరకాల పదవీ కాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల ముందస్తుగా పరకాల రాజీనామా చేయడం వెనుక బీజేపీ హస్తం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలసీతారామ్‌ భర్త పరకాల ప్రభాకర్‌. నిర్మల సీతారామన్‌ బీజేపీలోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక వ్యక్తిగా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ, టీడీపీకి మధ్య తీవ్ర అంతరం ఉండటంతో పాటు ఒకరిపై ఒకరు ఆరోపణులు గుప్పించుకుంటున్నారు. చంద్రబాబు ఏకంగా ప్రధానే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో నడుస్తుంది. ఈనేపథ్యంలో చంద్రబాబుకు నాలుగేళ్లుగా అతి దగ్గరగా ఉండుకుంటూ వస్తున్న పరకాలను రాజీనామాచేయడం ద్వారా, చంద్రబాబు అవినీతి అక్రమాలపై దృష్టిపెట్టే యోచనలో బీజేపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలని చూస్తున్న బీజేపీ పరకాలను ఓ హస్త్రంలా మార్చుకొనేందుకు కసరత్తు చేస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.