ఏయిర్‌ఫోర్స్‌లోకి ‘తేజస్‌’

3

– చిరకాల స్వప్నం సాకారం

బెంగళూర్‌,జులై 1(జనంసాక్షి): స్వదేశీ యుద్ధ విమానం తేజస్‌ శుక్రవారం భారత వైమానిక దళంలో చేరింది. ఈ తేలిక పాటి పోరాట విమానాన్ని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) అభివృద్ధి చేసింది. బెంగళూరులోని వైమానిక పరీక్షా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో దక్షిణాది వైమానిక దళ విభాగం అధిపతి ఎయిర్‌ మార్షల్‌ జస్బిర్‌ వాలియా సమక్షంలో రెండు తేజస్‌లను హెచ్‌ఏఎల్‌ అప్పగించింది. స్వాడ్రన్‌ 45 ఫ్లయింగ్‌ డాగర్స్‌ దళంలోకి యుద్ధ విమానాలు చేరాయి. భారత వైమానిక దళానికి ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 6, వచ్చే ఏడాది ఎనిమిది తేజస్‌లు సమకూర్చుకోవాలని వైమానిక దళం భావిస్తోంది.  2018వ సంవత్సరంలో లోపు ఆ దళంలోకి మరో 18 యుద్ధ విమానాలు చేరుతాయి. అందులో నాలుగు శిక్షణ విమానాలు కూడా ఉంటాయి. ఎయిర్‌ మార్షల్‌ జస్బీర్‌ వాలియా తేజస్‌ యుద్ధ విమానాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. తమిళనాడులోని సులుర్‌ను లైట్‌ కంబాట్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఎల్‌సీఏ) బేస్‌గా ఎంపిక చేశారు. ఎల్‌సీఏ ప్రాజెక్టును 1985లో ప్రారంభించారు. సుమారు 30 ఏళ్ల తర్వాత తేజస్‌ ప్రాజెక్టుకు ఎట్టకేలక నిజం కానుంది. బెంగుళూరుకు చెందిన హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ సంస్థ ఈ విమానాన్ని తయారు చేసింది. ఆలస్యంగా తేజస్‌ యుద్ధ విమానం వైమానిక దళంలోకి చేరినా.. చాలా ఆధునిక వెపన్‌ తమ దళంలోకి ప్రవేశిస్తోందని వైమానిక వర్గాలు భావిస్తున్నాయి. తేజస్‌ యుద్ధ విమానంలో విదేశీ ఇంజిన్‌ ను పొందుపరిచారు. ఇజ్రాయిల్‌ రాడార్‌ టెక్నాలజీని వాడారు. బ్రిటీష్‌ ఎజెక్షన్‌ సీటును కూడా రూపొందించారు. విమానంలో  బై వర్‌ సిస్టమ్‌ తో పాటు కంప్యూటర్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ను భారత్‌ తయారు చేసింది. విమానం తేలిక పాటిగా ఉండేందుకు దాన్ని కార్బన్‌ ఫైబర్‌ మిశ్రమాలతో తయారు చేశారు. ఇది ఖనిజాల కంటే కూడా ఎక్కువ దృఢంగా ఉంటుంది.