*ఏరువాక పౌర్ణమి పురస్కరించుకొని రైతులను ఘనంగా సన్మానించిన వేమూరి*
మునగాల, జూన్ 14(జనంసాక్షి): మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామానికి చెందిన రైతులను ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, భూమిని పంటను పశువును మొక్కడం భారతీయ సంస్కృతి సాంప్రదాయం అని, తనలోని సారాన్ని ధాన్యంగా మార్చి భూమాత మనకు అందిస్తుందన్నారు. ఆ సారాన్ని ఆహారంగా మార్చెందుకు మనిషి చేసే పవిత్ర యజ్ఞమే వ్యవసాయం అలాంటి యజ్ఞానికి శ్రీకారం చుట్టినరోజే ఏరువాక పున్నమి అన్నారు. ఈ రోజున్నే రైతులందరూ వ్యవసాయ పనులు మొదలుపెడతారని, చంద్రుడు జేష్ఠ నక్షత్రానికి దగ్గరగా ఉండే సమయంలో వ్యవసాయ పనులు మొదలు పెడితే దిగుబడి బాగా వస్తాయని ప్రతీతి అన్నారు. అలాగే మన అందరికీ ఆహారం పెడుతూ మన అభివృద్ధికి కారణభూతమైన ఏరువాక పున్నమి రోజున ఇలా వారిని సన్మానించడం అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా నాణ్యమైన ఎరువులు విత్తనాలు సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లు అందించి రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర అందించాలని, 55 ఏళ్లు దాటిన ప్రతి రైతుకు నెల నెల మూడు వేల రూపాయల పెన్షన్ అందించాలని, రైతే రాజు దేశానికి వెన్నుముక అని మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి చూపించాలని, రైతు పక్షపాతిగా ప్రభుత్వాల పనితీరు ఉండాలని, వ్యవసాయానికి ఉపాధి హామీ పనులు అనుసంధానం చేయాలని, ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితులు ఉండవని, రైతు కుటుంబాల్లోని వ్యవసాయం చేసే వారికి వివాహాలు జరగడం కూడా కష్టంగా ఉందని, రైతులు కష్టపడి కాకుండా ఇష్టపడి వ్యవసాయం చేసేలాగా రైతులను ప్రోత్సహించేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని, రైతులకు ఉచితంగా ఎరువులు అందించాలని, వ్యవసాయ పనులు మొదలవుతుంది కావున ఎలాంటి ఆంక్షలు లేకుండా బ్యాంకు రుణాలు అందించాలని, కౌలు రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలని దేశం సుభిక్షంగా ఉండాలని, మనకు అన్నం పెట్టే రైతు ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని రైతు ఆత్మహత్యల నుండి విముక్తి కలిగే లాగా తగిన విధంగా రైతాంగానికి ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సన్మానం పొందిన రైతులు బారి లక్ష్మయ్య, బొమ్మ అంజయ్య, వీరబోయిన రామయ్య, బాలిన లక్ష్మయ్య, అల్లి చిన్న రామయ్య, పుల్లూరి వీరబాబు, చెర్వుపల్లి పిచ్చయ్య, వార్డ్ మెంబర్ మాదాసు ప్రభాకర్, రైతులు వీరబోయిన వెంకన్న, బొమ్మ వీరబాబు, పచ్చిపాల రామయ్య, చెర్వుపల్లి లింగయ్య, బొమ్మ వీరబాబు, పచ్చిపాల వెంకటేశ్వర్లు, షేక్ హుస్సేన్, షేక్ అజ్జు, బారి సతీష్, రైతులు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.