ఏ కూటమిలో చేరను ` మాయావతి


లఖ్‌నవూ(జనంసాక్షి): బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) ఏ కూటమిలోనూ చేరడం లేదని ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ‘ఇండియా’, ఎన్డీయే కూటమిలోని పార్టీలన్నీ ఒక్కటేనని ఆమె విమర్శించారు. అవి పేదలంటే గిట్టని.. ధనికుల పార్టీలని, కుల, మత రాజకీయాలు చేయడమే వాటి నైజమని దుయ్యబట్టారు. మరో రెండు రోజుల్లో ‘ఇండియా’ కూటమి మూడో సమావేశం ముంబయిలో జరగనుంది. ఈ నేపథ్యంలో మాయావతి ఎక్స్‌ (ట్విటర్‌) మాధ్యమంలో వరుసగా పోస్టులు పెట్టారు.రెండు కూటములతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశమే బీఎస్పీకి లేదని ఆమె పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని వివరించారు. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. నేటి పాలకులు విస్మరించిన కోట్లాది మందిని ఏకతాటిపైకి తీసుకొచ్చి 2007లో మాదిరిగా అధికారంలోకి వస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడానికి అన్ని రాజకీయ పక్షాలు ఎదురు చూస్తున్నాయని మాయావతి చెప్పారు. ‘ఇండియా’ కూటమిలో చేరకపోతే మేము భాజపాతో కుమ్మక్కయ్యామని, చేరితే సెక్యులర్‌ అనే విమర్శలు మానుకోవాలని రెండు కూటముల నేతలకు హితవు పలికారు.మాయావతి 2007లో నాలుగోసారి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఒక్క ఎమ్మెల్యే స్థానంలో మాత్రమే గెలుపొందింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేయడంతో 10 స్థానాలు దక్కాయి.