ఐఎస్ఎల్ విజేత కోల్‌కతా
కొచ్చి: ఉత్కంఠగా జరిగిన ఫైనల్ ఫైట్‌లో అట్లెటికో డి కోల్‌కతా.. కేరళ బ్లాస్టర్స్‌ను షూటౌట్ చేసి రెండోసారి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌లో కోల్‌కతా 4-3తో కేరళ బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఐఎస్ఎల్-3 టైటిల్ ఫైట్‌లో నిర్ణీత సమయంలో ఇరు జట్లూ 1-1తో నిలిచా యి. కేరళ ఆటగాడు మహమ్మద్ రఫీ (37వ నిమిషం) గోల్ చేయగా.. 44వ నిమిషంలో హెన్రిక్ సెరీనో (అట్లెటికో) గోల్ చేసి స్కోరు సమం చేశాడు. ఎక్స్‌ట్రా టైమ్‌లోనూ ఇరు జట్లూ గోల్ చేయడంలో విఫలం కావడంతో షూటౌట్ తప్పనిసరైంది. పెనాల్టీ షూటౌట్‌లో కోల్‌కతా తరఫున జెవల్ రజా, సమీర్ ధిగే, బోజా ఫెర్నాండెజ్, లారా గోల్ చేయగా.. హ్యూమ్ కిక్‌ను బ్లాస్టర్ కీపర్ స్టాక్ నేర్పుగా అడ్డుకున్నాడు. కేరళ తరఫున ఆంటోనియో జర్మన్, బెల్ ఫోర్ట్, మహమ్మద్ రఫిక్ గోల్ చేయగా.. ఎల్హాద్‌జి నొడాయో, హెడ్రిక్ హెంగ్‌బర్ట్ షాట్‌లు గురితప్పాయి. హెంగ్‌బర్ట్ ఐదో కిక్‌ను కోల్‌కతా కీపర్ మజుందార్ చాకచక్యంగా అడ్డుకోగా.. జెవల్ రాజా షేక్ గోల్‌చేసి 4-3తో అట్లెటికోను గెలిపించాడు.
భారీగా అభిమానులు..
ఫైనల్ మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు. 54 వేలకు పైగా ఫుట్‌బాల్ లవర్స్‌తో జవహర్‌లాల్ స్టేడియం కిక్కిరిసిపోయింది. ముఖ్యం గా సొంత జట్టు కేరళకు మద్దతు తెలిపేందుకు అభిమానులు పసుపు రంగు జెర్సీలు ధరించి, జెండాలు చేతబట్టుకుని వచ్చారు. కేరళ బ్లాస్టర్స్ సహ యజమాని సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో హాజరయ్యాడు. అట్లెటికో కో ఓనర్ సౌరవ్ గంగూలీ, ఐఎస్ఎల్ చైర్‌పర్సన్ నీతా అంబానీ, బాలీవుడ్ స్టార్ అమితాబ్, అభిషేక్ బచ్చన్, ఏఐఎ్‌ఫఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ మ్యాచ్‌ను వీక్షించారు.
బ్లాస్టర్స్‌కు రూ. 6 లక్షల జరిమానా
క్రమశిక్షణ చర్యల కింద కేరళ బ్లాస్టర్స్‌కు రూ. 6 లక్షల జరిమానా విధించారు. ఐఎస్ఎల్‌లో ఈ నెల 4న జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆటగాళ్ల దుందుడుకు ప్రవర్తన, ఫ్యాన్స్ అనుచిత చర్యల కారణంగా బ్లాస్టర్స్‌కు జరిమానా విధించినట్టు ఏఐఎఫ్ఎఫ్ తెలిపింది.