ఐకెన్‌ను నోబుల్ శాంతి పురస్కారం
ఓస్లో,డిసెంబర్ 10,(జనంసాక్షి):అణ్వస్త్రరహిత ప్రపంచాన్ని సాకారం చేసేందుకు కృషి చేస్తున్న ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియార్ వెపన్స్ (ఐసీఏఎన్-ఐకెన్) సంస్థ 2017 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకుంది. ఓస్లోలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఈ నోబెల్ పీస్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రైజ్ మనీగా సుమారు రూ.7 కోట్లు ఐకెన్‌కు అందజేశారు.అణ్వస్త్ర ప్రయోగంతో ఎదురయ్యే విధ్వంసకర పరిణామాలపై అవగాహన కల్పిస్తూ అణ్వస్త్ర నిర్మూలనకు ఐకెన్ పనిచేస్తోంది. ఒప్పంద ఆధారిత అణ్వస్త్ర నిషేధం కోసం ఆ సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు గుర్తింపుగా గత అక్టోబర్‌లో ఐకెన్‌కు నోబెల్ శాతి పురస్కారం ప్రకటించారు. ఇంటర్నేషనల్ ఫిజీషియన్స్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ న్యూక్లియార్ వార్ సంస్థ 2006 సెప్టెంబరులో ఐకెన్ ఏర్పాటును ప్రతిపాదించింది. 2007 ఏప్రిల్‌లో ఆస్ట్రేలియా, వియన్నాల్లో ఐకెన్ పురుడుపోసుకుంది. ప్రస్తుతం జెనీవాలోని వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్లో ఐకెన్ కార్యాలయం పనిచేస్తోంది. 101 దేశాలకు చెందిన 468 ఎన్జీవోలతో కలిసి ఈ సంస్థ పనిచేస్తోంది.