ఐటీడీఏలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు

124 గిరిజన గ్రామాలకు రహదారులు మంజూరు

విజయనగరం,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): సీతంపేట ఐటీడీఏలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ ధనుంజయరెడ్డి అన్నారు. సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో శనివారం 74వ పాలక వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పూర్తిగా రహదారి సౌకర్యం లేని 124 గిరిజన గ్రామాలకు రహదారులు మంజూరు చేశామని, మరో 88 గ్రామాలకు గతంలో వేసిన రహదారులు పాడవ్వడంతో మరమ్మతులు చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా వైద్యఆరోగ్యశాఖ, గిరిజన సంక్షేమ విద్యా, ఇంజనీరింగ్‌, వెలుగు తదితర శాఖల పనితీరుపై సమావేశంలో చర్చించారు. పలాస ఎమ్యెల్యే శివాజీ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో రోగులను డోలీలతో

మోసుకుని వెళ్లే పరిస్థితి లేకుండా చూడాలన్నారు. పాతపట్నం వెంకటన్న మాట్లాడుతూ తన నియోజక వర్గంలో ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉందని ప్రత్యేకంగా దృష్టి సారించి నియామకాలు చేపట్టాలన్నారు. ఎమ్మెల్సీ మాధవ్‌ మాట్లాడుతూ ప్రాంతీయ ఆస్పత్రుల్లో నివాస సముదాయాలు ఏర్పాటు చేస్తే వైద్యులు, సిబ్బంది ఉండేందుకు అవకాశం కలుగుతుందన్నారు. పాలకొండ ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ వెలుగుశాఖ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజాప్రతినిధులు తెలియజేయడం లేదని సభ దృష్టికి తీసుకుని వచ్చారు. ఇంజనీరింగ్‌శాఖ ద్వారా జరుపుతున్న రహదారి పనులు వేగంగా పూర్తి చేయడం లేదని పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీ అధ్యక్షురాలు ధనలక్ష్మి, నర్సన్నపేట, ఇచ్చాపురం, రాజాం ఎమ్మెల్యేలు రమణమూర్తి, అశోక్‌, జోగులు, గిరిజన సలహా మండలి సభ్యలు జయకృష్ణ, ఐటీడీఏ పీవో శివశంకర్‌ ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు