ఐదేళ్లలో లక్ష కోట్ల మోసం!

– బ్యాంకులను నిండా ముంచిన రుణ ఎగవేతదారులు
– తాజా నివేదికలో పేర్కొన్న ఆర్బీఐ
న్యూఢిల్లీ, మే2( జ‌నం సాక్షి) : బ్యాంకులు నిండా మునుగుతున్నాయి. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం వివిధ బ్యాంకుల్లో గత ఐదేళ్లలోనే రూ. లక్ష కోట్ల మోసం జరిగింది. మొత్తం ఇలాంటివి 23వేల కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ సమాధానమిచ్చింది. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి 1 వరకు 5152 కేసులు నమోదైనట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ మధ్యకాలంలోనే అత్యధికంగా రూ.28459 కోట్లు బ్యాంకులు నష్టపోయినట్లు వెల్లడించింది.
2016-17లో మొత్తం 5076 కేసులు నమోదవగా.. రూ.23,933 కోట్ల మోసం జరిగింది. 2013, మార్చి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 23,866 కేసులు నమోదయ్యాయి. రూ.లక్ష 718 కోట్లు బ్యాంకులు నష్టపోయినట్లు ఆర్బీఐ చెప్పింది. ఈ కేసులన్నింటిలో దర్యాప్తు జరిపి.. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. బడా వ్యాపారవేత్తలు, ప్రముఖులు బ్యాంకులను నిండా ముంచుతున్న కేసులపై సీబీఐ, ఈడీలాంటి సంస్థలు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆర్బీఐ వెల్లడించిన ఈ అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ మధ్యే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో వెలుగుచూసిన రూ.13 వేల కోట్ల స్కామ్‌లో వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇలా దేశంలోని బ్యాంకులన్నింటి దగ్గరా పేరుకుపోయిన నిరర్ధక ఆస్తుల విలువ రూ.8,40,958 కోట్లుగా ఉన్నట్లు ప్రభుత్వం ఈ మధ్యే వెల్లడించింది. ఇందులో అత్యధికంగా రూ. 2,01,560 కోట్ల నిరర్ధక ఆస్తులతో ఎస్‌బీఐ ముందుంది.