ఐపీఎల్‌ బెట్టింగులో ప్రముఖులు

ముంబైలో ఆధారాలు సేకరించిన పోలీసులు
శ్రీశాంత్‌ ల్యాప్‌టాప్‌ స్వాధీనం
ముంబై, మే 18 (జనంసాక్షి) :
ఐపీఎల్‌ బెట్టింగ్స్‌కు సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఆకర్షితులవుతారని మరోసారి రుజువైంది. తాజాగా ఐపీఎల్‌ ఆరో సీజన్‌లో వెలుగులోకి వచ్చిన స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంతో బెట్టింగ్‌ డొంక కూడా కదులుతోంది. ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ముంబై పోలీసులు రంగంలోకి దిగి పలు ఆసక్తికర నిజాలు రాబట్టారు. ఐపీఎల్‌పై దేశవ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయల బెట్టింగ్‌ నడుస్తోందని ఇటీవలే వెల్లడైంది. అయితే ఈ బెట్టింగ్‌లో పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా పాలుపంచుకుంటున్నట్టు సమాచారం. ముంబై పోలీసులకు దీనిపై పక్కా ఆధారాలు కూడా లభించినట్టు తెలుస్తోంది. బుకీలు ఇచ్చిన సమాచారం ప్రకారం బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు కొందరు బెట్టింగ్‌పై ఆసక్తితో కోట్ల రూపాయలలో పందాలు కాసినట్టు వెల్లడైంది. హిందీ టీవీ సీరియల్స్‌ నిర్మిస్తూ హీరో నుంచి నిర్మాతగా మారిన ఒక పెద్ద వ్యక్తి , అలాగే సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా మారిన సదరు వ్యక్తి సోదరునితో పాటు మరికొంతమంది డైరెక్టర్లు, నిర్మాతలు కూడా బెట్టింగ్‌లో పందాలు కాసినట్టు పోలీసులు చెబుతున్నారు. బాలీవుడ్‌ సెలబ్రిటీలు బెట్టింగ్‌  చేయడం కొత్తమీ కాదు. గత ఏడాది పెద్ద ఎత్తున బుకీలను అరెస్ట్‌ చేసిన సందర్భంలోనూ పలువురి నిర్మాతల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇలా బెట్టింగ్‌ ద్వారా వచ్చిన డబ్బును సినిమా, సీరియల్స్‌ నిర్మాణంలో వినియోగించినట్టు కూడా విచారణలో తేలింది. ఇదిలా ఉంటే ఒక పెద్ద హీరో ఆర్థిక వ్యవహారాలపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఇటీవల సదరు హీరో పెద్ద మొత్తంలో దుబాయ్‌కి హవాలా మార్గంలో డబ్బు చేరవేసినట్టు సమాచారం రావడంతో నిఘా ఉంచారు. పక్కా ఆధారాలు లభించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన శ్రీశాంత్‌ ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబయిలోని జిజు లగ్జరీ హోటల్‌లో శ్రీశాంత్‌ బస చేసిన గది నుంచి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బుకీలతో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాళ్ల సంబంధాలు, స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు, ఇతర వివరాలకు సంబంధించిన ఆధారాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నామని వారు పేర్కొన్నారు.