ఐఫోన్ 7 ధర రూ. 63 వేలు

7టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఐఫోన్-7 అతి త్వరలోనే భారత్ కు రానుంది. నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ గా పేరొందిన ఐఫోన్-7 ఈరోజు (సెప్టెంబర్ 7న) అంతర్జాతీయంగా విడుదల కానుండగా.. మరో 19 రోజుల్లో భారత్ కు ఇది రానుంది. సెప్టెంబర్ 26న ఐఫోన్-7ను భారత్ లో విడుదల చేయనున్నారు.

బుధవారం సాన్ ఫ్రాన్సిస్కోలోని గ్రహం బిల్  సివిక్ ఆడిటోరియంలో అట్టహాసంగా జరగనున్న వేడుకలో ఐఫోన్-7ను ఆపిల్ ఆవిష్కరించనుంది. అంతర్జాతీయంగా ఆపిల్-7 బేస్ మోడల్ (32జీబీ) ధరను 749 డాలర్లుగా నిర్ణయించారు. భారత్ లో దీని ధర సుమారు రూ. 63వేలు ఉండే అవకాశముంది.

అమెరికాలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ మధ్యలో ఐఫోన్-7 అమ్మకాలు ప్రారంభమవుతాయని, భారత్ కు వచ్చేసరికి సెప్టెంబర్ 26నుంచి ఐఫోన్-7 మార్కెట్ లో లభిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, రెండో అతిపెద్ద స్మార్ట్ మార్కెట్ అయిన భారత్ పై ఆపిల్ ఈ మధ్య ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది భారత్ లోనే యాపిల్ అత్యధిక అమ్మకాలు జరిపింది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో భారత్ లో ఐఫోన్ అమ్మకాలు 51శాతం పెరిగాయి. అంతేకాకుండా గత ఏడాది తొలిసారిగా భారత్ లో ఆపిల్ కంపెనీ ఒక బిలియన్ డాలర్ మార్క్ ఆదాయాన్ని సాధించింది.