ఐసియూలో ఎలుక సంచారం

కోమాలో ఉన్న యువకుడిని కరవడంతో మృత్యువాత
ముంబై,మే5(జ‌నం సాక్షి ): మన ఆస్పత్రలు నిర్వహణ తీరు అధ్వాన్నంగా ఉందని మరోమారు నిరూపితమయ్యింది.  కోమాలో ఉన్న ఓ యువకుడిని  కాపాడుకునేందుకు ఆస్పత్రికి తీసుకెళితే  ఎలుక రూపంలో మృత్యువు వెంటాడిన వైనమిది. గుంటూరులో చిన్నారులను ఎలుకుల మట్టుబెట్టిన తరహాను మించి ఐసియూలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముంబైకి చెందిన 27 ఏళ్ల యువకుడు  పరవిూందర్‌ గుప్తా గత ఏడాది ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. థానే ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం అతడిని జోగేశ్వరిలోని బాల్‌ థాకరే ట్రామా కేర్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ పరవిూందర్‌ శుక్రవారం మృతి చెందాడు. థానే నుంచి తీసుకొచ్చిన సమయంలోనే పరవిూందర్‌ కోమాలోకి వెళ్లినట్టు జోగేశ్వరి వైద్యులు వెల్లడించారు.
కాగా ఐసీయూలో ఉండగా పరవిూందర్‌ కంటిపై గత నెల 23న ఓ ఎలుక కరిచినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలను తిరస్కరించిన ఆస్పత్రి యాజమాన్యం.. దీనిపై విచారణ జరుపుతామంటూ చెప్పుకొచ్చింది. మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు కోపర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారనీ.. అయినప్పటికీ కుటుంబ సభ్యులు అంగీకరించేలేదని ఆస్పత్రి ప్రతినిధి ఒకరు వెల్లడించారు. పరవిూందర్‌ను కాపాడేందుకు వైద్యులు శాయశక్తులా కృషి చేశారు. కాని ఫలితం లేకపోయింది…అని ఆయన పేర్కొన్నారు. అయితే ఎలుక వ్యవహారాన్ని కప్పు పుచ్చుకోవడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
—-