ఒకే కుటుంబంలో మూడ్రోజుల్లో ముగ్గురి మృతి…

చిగురుమామిడి(కరీంనగర్ జిల్లా): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వివిధ కారణాలతో చనిపోవడంతో ఆ గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కుంచం రాజు(26)  రెండు రోజుల క్రితం కూకట్‌పల్లిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతను దుబాయి వెళ్లాలని అప్పు చేసి అది తీరకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దీంతో అతని మృతదేహన్ని సొంత గ్రామానికి తరలించారు. ఈ విషయం తెలిసిన రాజు అమ్మమ్మ అల్లెపు మల్లవ్వ(75) మనస్తాపంతో శనివారం మృతిచెందింది. కాగా, ఒకవైపు కొడుకు, మరోవైపు అత్త మరణించడంతో కుంచం రాములు(60) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో పూర్తి విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఒకే సారి ముగ్గురికి ఆంత్యక్రియలు జరపనున్నట్లు సమచారం.