ఒక్కరోజు కోర్టు హాజరు నుంచి వైఎస్‌ జగన్‌కు మినహాయింపు

హైదరాబాద్‌,నవంబర్‌ 8 (జనం సాక్షి) : సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి  విచారణకు హాజరుకాలేదు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పర్యటన ఉన్నందున ఒక్క రోజు మినహాయింపు ఇవ్వాలంటూ కోర్టును జగన్‌ కోరారు. దీంతో జగన్‌ అభ్యర్థనను సీబీఐ కోర్టు అంగీకరించింది. అక్రమాస్తుల కేసు తదుపరి విచారణ ఈనెల 22కి వాయిదా వేసింది. వ్యక్తిగత  హాజరు మినహాయింపు కోరుతూ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. సీఎంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున తనకు మినహాయింపు ఇవ్వాలంటూ జగన్‌ కోర్టును అభ్యర్థించారు. అయితే ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. చట్టం ముందు అందరూ సమానమేనని, పదవిలో ఉన్న కారణంగా వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరడం రాజ్యాంగంలోని 14వ అధికరణకు విరుద్ధమని కోర్టు పేర్కొంది.