ఒబామా వరాల జల్లు ఉపాధి కల్పనే లక్ష్యం

మధ్య తరగతి ప్రజలే ఎజెండా
ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కృషి
ఉభయ సభలనుద్దేశించి ఒబామా ప్రకటన
వాషింగ్టన్‌, (జనంసాక్షి) :
అమెరికా ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తానని రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బరాక్‌ ఒబామా ప్రకటించారు. మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. బలమైన కుటుంబాలు, సముదాయాలతోనే బలమైన అమెరికా నిర్మాణం అవుతుందన్నారు. అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా బాధ్యతను పూర్తి చేశామని, అక్కడ ఉన్న సైన్యాన్ని తొలగించనున్నట్లు తెలిపారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఒబామా… ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. రెండోసారి చేపట్టిన పదవీ కాలంలో మధ్యతరగతి ప్రజల అభివృద్ధే అజెండాగా పని చేయనున్నట్లు తెలిపారు. కనీస వేతనాన్ని గంటకు తొమ్మిది డాలర్లకు పెంచాలని ఉభయసభలకు సూచించారు. దీనివల్ల పేదరిక తగ్గి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు మధ్యతరగతి ప్రజలే మూలమని, వారు బలోపేతం అవుతూనే ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందన్నారు. మధ్య తరగతి ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు గన్‌ కల్చర్‌ నిరోధానికి కృషి చేస్తానని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని ఒబామా అమెరికన్లకు హామీ ఇచ్చారు. తాను ఎప్పుడూ అమెరికా అభివృద్ధి కోసమే పాటు పడతానని పునరుద్ఘాటించారు. ఇమ్మిగ్రేషన్‌, వాతావరణ మార్పులు, అమెరికా ఎదుర్కొంటున్న సంక్షోభాలపై చర్యలు చేపట్టాలని ఉభయ సభల సభ్యులకు సూచించారు. ఇటీవల పెరిగిపోతున్న తుపాకీ కాల్పులపై ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. గన్‌ కల్చర్‌ నిరోధానికి కృషి చేస్తానన్నారు. అఫ్గానిస్తాన్‌లో అమెరికా తన కర్తవ్యాన్ని నెరవేర్చిందని ఒబామా ధీమాగా చెప్పారు. వచ్చే ఏడాది కల్లా అఫ్గాన్‌లో ఉన్న 34 వేల అమెరికా బలగాలను దశల వారిగా ఉపసంహరించనున్నట్లు ప్రకటించారు. అక్కడ దశాబ్ద కాలంగా జరుగుతున్న పోరాటం 2014 చివరి నాటికి ముగిసిపోతుందన్నారు. అఫ్గాన్‌లో ఉన్న అమెరికన్‌ సైనికులనును వెనక్కి పిలవనున్నామని, ఇకనుంచి అఫ్ఘాన్‌ బలగాలు నేతృత్వం వహిస్తాయని తెలిపారు. ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా రూపాంతరం చెందుతోందని ఒబామా తెలిపారు. దాన్ని నియంత్రించేందుకు అమెరికా సైన్యం ప్రపంచ వ్యాప్తంగా పోరాడుతోందన్నారు. అఫ్ఘానిస్తాన్‌లో అల్‌ఖైదాను గట్టిగా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు. ఉగ్రవాద సంస్థపై పోరాటం చేస్తున్న దేశాలకు అమెరికా సైన్యం అండగా నిలబడుతుందన్నారు.