ఒమైక్రాన్ జాగ్రత్తలు తీసుకోండి
బూస్టర్ డోస్‌కు అనుమతించాలి
కేంద్రానికి మహారాష్ట్ర సర్కార్ లేఖ
ముంబై,డిసెంబర్7(జనంసాక్షి): ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నందున తగు జాగ్రత్తుల తీసుకోవాలంటూ హారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మహారాష్ట్రలో కోవిడ్ వేరియంట్ ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే కేంద్రానికి మూడు సూచనలు చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు మంగళవారంనాడు లేఖ రాశారు. ఒమైక్రాన్ వేగంగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తాను పలువురు వైద్యులను సంప్రదించానని చెప్పారు. అందుకు అనుగుణంగా తాను సూచనలు చేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. బూస్టర్ షాట్లను తీసుకునేందుకు అనుమతించాలని, వ్యాక్సినేషన్ వయస్సును, రెండు డోసుల మధ్య పాటించాల్సిన గ్యాప్‌ను తగ్గించాలని ఆదిత్య థాకరే సూచించారు. ఈ ఏడాది ప్రారంభంలో వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లను వారి కోరిక మేరకు మూడో డోస్ తీసుకునేందుకు అనుమతించాలన్నారు. ఇండియాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇటీవలం కాలంగా గణనీయమైన పురోగతి సాధించింది. కోవిడ్ నుంచి పౌరులందరికీ రక్షణ కవచం ఏర్పరచేందుకు ప్రయత్నాలు జరిగాయి. దాదాపు దేశవాసులందరి జీవన స్థితిగతులు సాధారణ స్థితికి చేరుకుంటున్న దశలో ఒమైక్రాన్ ముప్పు తొంగిచూస్తోందని ఆ లేఖలో ఆదిత్య పేర్కొన్నారు. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ తీసుకునేందుకు అనుమతించే కనీన వయో పరిమితిని 15 ఏళ్లకు తగ్గించాలన్నారు. ఇందువల్ల సెకండరీ స్కూల్, జూనియర్ కాలేజీ విద్యార్థులకు వ్యాక్సినేషన్ రక్షణ కలుగుతుందని అన్నారు. వ్యాక్సిన్ మొదటి డోసుకు, రెండో డోసుకు మధ్య గ్యాప్‌ను నాలుగు వారాలకు తగ్గించాలన్నారు. 2022 జనవరి మధ్య నాటికి రెండో డోస్ పూర్తి చేయాలన్నారు.