ఓటమిభయంతోనే ఎన్నికల వాయిదాకు కుట్ర
కొత్తగూడెం,సెప్టెంబర్8(జనంసాక్షి): విద్యుత్ రంగ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ఐఎన్‌టీయూసీ అనుబంధ 327 కార్మిక సంఘ నాయకులతోపాటు మరికొందరు కలిసి కోర్టును ఆశ్రయించి ఎన్నికలను
వాయిదా వేయించారని టీఆర్‌వీకేఎస్ నేతలు ఆరోపించారు. 120 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిలో ఏఐటీయూసీని టీబీజీకేఎస్ ఓడించిందని, అదేవిధంగా విద్యుత్ రంగంలో కూడా టీఆర్‌వీకేఎస్ పోటీ చేసి గెలువనున్న తరుణంలో పరోక్షంగా అడ్డుకొని ఎన్నికలను వాయిదా వేయించిందని ఆరోపించారు. తమ గెలుపు ఖాయం కావడంతో ఓర్వలేకనే కొంతమంది ఈ విధంగా చేశారని దుయ్యబట్టారు. విద్యుత్ రంగ ఎన్నికల్లో టీఆర్‌వీకేఎస్ ఒంటరిగా పోటీ చేసి గెలువనున్న తరుణంలో అడ్డుకున్నారని ఆరోపించారు. 28 ఏళ్ల నుంచి ఉన్న వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు ఎందుకు ఎన్నికలు పెట్టించలేదని, ఆ కార్మిక సంఘాల నాయకులు కూడా ఆనాటి ప్రభుత్వాలను ఎందుకు అడగలేదని వారు ప్రశ్నించారు. కార్మికులకు జవాబుదారీ తనంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొని సింగరేణిలో మాదిరిగానే విద్యుత్ రంగంలో ఎన్నికలు జరిపిస్తున్న తరుణంలో గెలువలేమనే బాధతో ఎన్నికలు జరగకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు కార్మికుల సమస్యలపై ఏ ఒక్క కార్మిక సంఘం కూడా పట్టించుకోలేదని, కొత్త క్వార్టర్ల నిర్మాణం, కేటీపీఎస్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. ఇలాంటి తరుణంలో టీఆర్‌వీకేఎస్ ఎన్నికల రంగంలో అడుగుపెట్టి అన్ని కార్మిక సంఘాల్లోని టీఆర్‌ఎస్ శ్రేణులను సమాయత్తం చేయడం జరిగిందని వారు తెలిపారు.