ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధానం: బ్రహ్మ

హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ఓటరుకు ఆధార్‌ కార్డు అనుసందానం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘంనిర్ణయించింది. దీంతో బోగస్‌ ఓటర్లను అరికట్టాలని తీర్మానించారు.  తెలంగాణ, ఆంధప్రదేశ్‌ కలెక్టర్లతో సీఈసీ బ్రహ్మ శనివారం నాడిక్కడ సమావేశమయ్యారు. ఓటర్‌ ఐడీతో ఆధార్‌కార్డును అనుసంధానంపై చర్చించారు. దేశవ్యాప్తంగా 84కోట్ల మంది ఉన్నారని, 74కోట్ల మందికి ఆధార్‌కార్డులు ఉన్నాయని అనంతరం సిఈసీ బ్రహ్మ విూడియాకు తెలిపారు. వీటన్నింటినీ ఆధార్‌కార్డుతో అనుసంధానం చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీనివల్ల ఫ్రీ అండ్‌ ఫేర్‌ ఎలక్షన్‌ నిర్వహించడానికి వీలవుతుందన్నారు. మార్చి 1 నుంచి ఆగస్టు 15లోపు ఆధార్‌కార్డుతో ఓటరు కార్డును అనుసంధానం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. దేశవ్యాప్తంగా 676 జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయనున్నట్టు చెప్పారు. ఇందుకు తెలంగాణ, ఆంధప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని బ్రహ్మ కోరారు. ఈవీఎంలో ట్యాంపరింగ్‌ జరిగే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలవడంపై అక్కడి ఎమ్మెల్యేలు, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.