ఓటర్‌ ఐడికి కూడా పర్మినెంట్‌ నంబర్‌ ఇస్తే మేలు !

భారతీయ జనతాపార్టీ బలోపేతంతో పాటు..వివిధ పథకాల అమలుకు మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు విపక్ష పార్టీల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతకాలం ఓటరు జాబితాల విషయంలో పారదర్శకత ఉండేది కాదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు పేర్లు నమోదు చేయించడం.. తమ ప్రత్యర్థుల వారికి చెందిన ఓట్లను తొలగించడం జరిగేది. తాజాగా ఓటరు నమోదు బిల్లు చట్టరూపంలో రానుండడంతో ఇక అలాంటి ఎత్తులు పనిచేయకపోవచ్చు. ఓటుకు ఆధార్‌ అనుసంధానం చేయాలన్న చట్టం రానుండడంతో బోగస్‌ ఓట్లు ఎగిరిపోతాయి. ఎందుకంటే ఆధార్‌ నమోదుతోనే ఓటు నమోదు అవుతుంది. ఇదే సందర్భంలో ఓటుకు కూడా ఆధార్‌ లాగా పర్మినెంట్‌ నంబర్‌ కూడా కేటాయిస్తే మరీ మంచిది. అప్పుడు బోగస్‌ అన్నదానికి చెక్‌ పెట్టగలం. సంస్కరణలను ఆషామాషీగా కాకుండా పక్కాగా చేస్తేనే మంచిది. అనేక పథకాలకు ఆధార్‌ నమోదుతో బోగస్‌ వ్యవహారాలు తగ్గాయి. తాజాగా పార్లమెంట్‌ ఈ బిల్లు ఆమోదించడంతో ఇప్పుడు బోగస్‌ ఓట్లు నమోదు చేయించే పార్టీలకు పెద్ద షాక్‌ తగిలినట్లుగానే భావించాలి. ఓటరు నమోదుకు సంబంధించి ఎన్నికల సంస్కరణ కీలక అడుగుగా భావించాలి. అలాగే ఆడపిల్లల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచారు. ఈ రెండు సంస్కరణలను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ రెండు సంస్కరణలను సామాన్యులు స్వాగతిస్తున్నారు. దీంతో సామాన్యుల ఓటు సహజంగానే మోడీ ఖాతాలో పడుతుంది. అందు కే విపక్షాల భయం. అందుకే వారు ఈ సంస్కరణలను వ్యతిరేకించారు. ప్రజలకు మేలు చేసే విషయాల్లో గుడ్డిగా వ్యతిరేకించడం తగదన్న విషయాన్ని విపక్షాలు గుర్తిస్తే మంచిది. అందుకే ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య అత్యంత కీలకమైన ఎన్నికల సంస్కరణల బిల్లుకు సోమవారం లోక్‌సభ స్వల్ప చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. రాజ్యసభలోనూ ఆమోదం పొంది చట్టంగా మారితే ఓటర్ల జాబితాను అధికార పార్టీలు తమ రాష్టాల్ల్రో ఇష్టం వచ్చినట్లు మార్చే ప్రమాదం ఉండదు. బోగస్‌ ఓటింగ్‌ను అడ్డుకునేందుకే ఈ బిల్లును ప్రవేశ పెడుతున్నామని న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు చేసిన ప్రకటనను స్వాగతించాల్సిందే. సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా నిర్వచించినందువల్ల ఆధార్‌, ఓటర్‌ ఐడీలను అనుసంధానం చేయడం ప్రాథమిక హక్కులకు భంగకరమని వాదించిన విపక్షాలు అందులో నిజం లేదని గుర్తించి ఉంటే బాగుండేది. ఆధార్‌`ఓటర్‌ గుర్తింపు కార్డుల అనుసంధానానికి అనుమతిస్తే దేశ పౌరులు కానివారు ఓటేసేందుకు అవకాశం ఉండబోదు. ఆధార్‌లో ఇక బోగస్‌ లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఈ బిల్లు చట్టంగా మారితే దేశ ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌ హక్కును కోల్పోతారని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు. ఎందుకంటే పాతబస్తీలో ఇష్టం వచ్చినట్లుగా ఓట్లు వేయించుకునేది ఆయనే కనుక..సహజంగానే ఓవైసీకి అలాంటి భయాలు ఉంటాయని వెల్లడయ్యింది. తాజాగా తీసుకుని వచ్చి చట్టం వల్ల ఒకే వ్యక్తి పలు చోట్ల ఓటును నమోదు చేసుకుని ఓట్లు వేయడాన్ని ఈ బిల్లు అడ్డుకుంటుంది. కొత్తగా ఓటు నమోదు చేసుకొనే వారు గుర్తింపు చిహ్నంగా ఆధార్‌ కార్డును చూపి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓటరుగా నమోదైన వారిని కూడా అధికారులు ఆధార్‌ అడగొచ్చని ఈ బిల్లు ద్వారా స్పష్టం అయ్యింది. ఓటర్ల జాబితాను సరి చూసు కొనేందుకు, వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదైతే గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఆధార్‌ చూపలేదన్న కారణంతో ఓటరు నమోదు దరఖాస్తు పత్రాన్ని తిరస్కరించడానికి వీల్లేదు. ఆధార్‌ చూపలేదన్న కారణంతో ఇప్పటికే ఓటరుగా నమోదైన వారి పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించ కుండా కూఆ ఏర్పాట్లు చేశారు. ఆధార్‌ ఇవ్వకపోవడానికి,
ఇవ్వలేక పోవడానికి దరఖాస్తుదారులు లేదా ఓటర్లు తగిన కారణం చెప్పాల్సి ఉంటుంది. అలాంటి వారికి ఇతర ప్రత్యామ్నాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకొని ఓటును నమోదు చేయడం లేదా ధ్రువీకరించడం చేస్తారు. నిజానికి 2015లోనే ప్రభుత్వం బోగస్‌ ఓట్లను ఏరివేసేందుకు ఆధార్‌`ఓటర్‌ ఐడీ అనుసంధాన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి చట్టబద్ధత లేదని సుప్రీంకోర్టు కొట్టేయడంతో నిలిపేసింది. పాత చట్టం ప్రకారం అధికారులకు ఓటర్ల ఆధార్‌ నంబరు అడిగే హక్కు లేకపోవడంతో చట్టపరమైన ఇబ్బందులు లేకుండా తాజాగా సవరణలు చేపడుతున్నారు. నిజానికి మనదేశంలో డుప్లికేట్‌ ఓటర్ల సమస్య తీవ్రంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఓటరుగా నమోదు చేయించుకోవడం..ఒకటికి మించి అనేక ప్రాంతాల్లో ఓట్లు వేయడం చేస్తున్నారు. ఆధార్‌తో ఓటర్‌ ఐడీ అనుసంధానం ద్వారా దాన్ని పరిష్కరించడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఆధానర్‌ కార్డు లాగానే ఓటరు ఐడికి కూడా పర్మినెంట్‌ నంబర్‌ ఉంటే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఓటును కోల్పోవడం లేదా..బోగస్‌ను నివారించవచ్చని అంటున్నారు. ఆధార కార్డు మాదరిగా ఓటర్‌ ఐడికి నంబర్‌ ఉంటే మంచిదని అంటున్నారు. ఇకపోతే సైనిక కుటుంబాలకు ఓటు హక్కు విషయంలో మరో సవరణ చేశారు. సైనికుడితో పాటు సైనికుడి భార్యకు మాత్రమే ప్రస్తుతం సర్వీస్‌ ఓటు అవకాశం కల్పిస్తు న్నారు. సైనికురాలి భర్తకు సర్వీసు ఓటును వినియోగించుకొనే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుత చట్టంలో సర్వీస్‌ పర్సన్‌ భార్య అనిమాత్రమే ఉంది. దాన్ని సర్వీస్‌ పర్సన్‌ జీవిత భాగస్వామి అని మార్చారు. దాంతో మహిళా సైనికుల భర్తలు కూడా ఇక సర్వీస్‌ పర్సన్‌ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా..ఓటు పరమపవిత్రంగా ఉండేలా…ఒకరి ఓటు మరొకరు వేయకుండా..ఓటును అకారణంగా తొలగించకుండా కూడా గట్టి చర్యలు తీసుకోవాలి. ఓటు అన్నది ఆధార్‌ కార్డులాగా భద్రతలను కలిగి ఉండాలి. అప్పుడే దొంగ ఓట్ల నమోదుకు అవకాశం ఉండదు. ఇలాంటి అవకాశాలు లేకుండా ఓటరు నమోదును మరింత పకడ్బందీగా, పారదర్శకరంగా చేస్తే మంచిది. ఆధార్‌ లాగా పర్మినెంట్‌ సంఖ్యను కేటాయించాలి. దీంతో ఇదికూడా ధృవీకరణ కార్డులగా ఉపయుక్తం కాగలదు.