ఓటుకునోటు కేసులో చార్జీషీటు దాఖలు చేసిన ఏసీబీ

2

ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. 39 మంది సాక్షులను విచారించి, 25 పేజీల అభియోగ పత్రంతో పాటు 316 పేజీల అనుబంధ డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. ఐపీసీ 120బి, 34 సెక్షన్స్‌ తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 12 ప్రకారం అభియోగాలు నమోదు చేశారు.

మొదటి నిందితుడి (ఎ1)గా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి, ఎ2 గా సెబాస్టియన్‌, ఎ3 గా ఉదయసింహ, ఎ4 గా మత్తయ్య జేరూసలెం లను పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌ లో పేర్కొన్న ఐదో నిందితుడు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేరుని ఈ చార్జిషీట్లో చేర్చలేదు. మరో చార్జిషీట్‌ లో సండ్రతో పాటు మరికొంతమంది నిందితుల పేర్లు చేర్చే అవకాశాలు ఉన్నాయని ఏసీబీ వర్గాల సమాచారం. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) పూర్తి నివేదిక ఆధారంగా ఈ కేసుతో ఎవరెవరికి సంబంధం ఉందనే అంశాలను పొందుపర్చినట్లు తెలుస్తోంది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. తెలంగాణ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికల్లో టీడీపీ  అభ్యర్ధిగా పోటీ చేసిన వేం నరేందర్‌ రెడ్డితో పాటు పలువురికి సీఆర్పీసీ 160 కింద ఏసీబీ నోటీసులు ఇచ్చింది. వారిని బంజారాహిల్స్‌ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిపించి విచారించింది. ఈ కేసులో మొత్తం 39 మందిని సాక్షులుగా చేర్చింది. వీరికి సంబంధించిన అనుబంధ డాక్యుమెంట్లను చార్జిషీట్‌ తో పాటు పొందుపర్చింది.

ఓటుకు కోట్లు కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు ఇప్పటికే బెయిల్‌ ఇచ్చింది. ఈ అక్రమ వ్యవహారంపై కేసు నమోదు చేసి 60 రోజులు కావస్తోంది. ఏసీబీ కేసుల్లో 60 రోజులలోపు చార్జిషీట్‌ దాఖలు చేయాల్సి ఉంది. అందుకే, ఇవాళ ఈ కేసులో ఏసీబీ చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఐతే, ఇంకా ఫోరెన్సిక్‌ తుది రిపోర్టుపై ఏసీబీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా ఎవరెవరికి ఈ వ్యవహారంతో సంబంధం ఉందో నిర్ధారించుకొని సండ్రతో పాటు మరికొంత మంది పేర్లను సప్లిమెంటరీ చార్జిషీట్లలో చేర్చనున్నట్టు సమాచారం.