ఓటుకు నోటు కేసులో ఏసీబీ దూకుడు

హైదరాబాద్:ఓటుకు నోటు కేసు దర్యాప్తు ఊపందుకుంటోంది. టీడీపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను విచారించేందుకు సిద్దమయిన ఏసిబి అధికారులు… ఆయన ఇచ్చే సమాచారంతో మరికొందరికి నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. ఈ జాబితాలో 10 మంది అధికార పార్టీ ఎమ్యెల్యేలు ఉన్నట్లు సమాచారం. మొత్తం 25 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ ప్రణాళికలు రచించినట్లు ఏసిబి వద్ద ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లా నుంచి ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్‌ చేశారనేది ఆరోపణ.. దళిత, గిరిజన శాసన సభ్యులకు వల వేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని ఏసీబీ దగ్గర సమాచారం ఉందని లీకులు వస్తున్నాయి. అరెస్టయిన ఎమ్మెల్యే కాల్ డేటాలో డెలిట్ చేసిన మెసేజ్ రికవరిల్లో ఈ మేరకు కీలక సమాచారం సంపాందించారట. పలువురు ఎమ్మెల్యేలతో సండ్ర వెంకట వీరయ్య మాట్లాడినట్లు ఏసీబీ అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయట. ఈ సమాచారంతో మరి కొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది..
సోమవారం ఏసీబీ ముందు సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ స్నేహితుడు జిమ్మిబాబు హాజరు కానున్నారు. జిమ్మిబాబు పాత్రపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆరా తీశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న జిమ్మిబాబు కరీంనగర్ జిల్లా గోదావరిఖని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈయన తెరవెనుక ఫైరవీలు చేయడంలో సిద్ధహస్తుడిగా ఏసిబి అనుమానిస్తోంది. జిమ్మిబాబు రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు కావడంతో… డబ్బుకు సంబంధించి రేవంత్ నుంచి రాబట్టలేని విషయాలను అతడి నుంచి కూపీ లాగేందుకు సిద్దమవుతున్నారు.అయితే ఎంత మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. మరెంత మందికి వల విసిరేందుకు ప్రయత్నాలు చేశారు. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపై ఏసిబి లోతుగా విచారించనుంది. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయా? అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇరుకున పెట్టే అవకాశాలు ఉంటాయా? తదితర విషయాలపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది.