ఓటుకు నోటు కేసులో లోకేష్‌ డ్రైవర్‌కు నోటీసులు

1

హైదరాబాద్‌, ఆగస్టు12(జనంసాక్షి):

కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక వచ్చింది. టిడిపి ప్రధాన కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కొండల్‌రెడ్డిని ప్రశ్నించాలని ఏసీబీ అధికారులు నిర్ణయించారు. కేసుకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు సీఆర్పీసీ 160సెక్షన్‌ కింద కొండల్‌రెడ్డికి నోటీసు సిద్ధం చేశారు. కొండల్‌రెడ్డికి నోటీసు ఇచ్చేందుకు ఎన్టీఆర్‌ ట్ట్రస్‌భవన్‌, చంద్రబాబు నివాసానికి ఏసీబీ సిబ్బంది వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఏసీబీ సిబ్బంది వెనుదిరిగారు. నేడో.. రేపో కొండల్‌రెడ్డికి నోటీసు ఇచ్చేందుకు ఏసీబీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.ఓటుకు నోటు కేసు విచారణ ఇప్పుడు తెలుగుదేశం యువనేత, పార్టీ కార్యకర్తల సమన్వయకర్త లోకేష్‌ కారు డ్రైవర్‌ వరకు వచ్చింది. లోకేష్‌ వద్ద పనిచేస్తున్న కొండల్‌ రెడ్డి కోసం ఎసిబి పోలీసులు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకు వెళ్లారని, అక్కడ కొండల్‌ రెడ్డి లేకపోవడంతో టిడిపి ఆఫీస్‌ కు వచ్చారని చెబుతున్నారు. అక్కడ కూడ ఆయన లేరు. దాంతో ఆ సమాచారం ఇచ్చి వెళ్లారు. కొండల్‌ రెడ్డిని ఎసిబి బుధవారం నాడు విచారించాలని భావించింది.  ఓటు కు నోటు కేసు సమయంలో రేవంత్‌ గన్‌ మెన్‌ లతో కొండల్‌ రెడ్డి తరచూ మాట్లాడారని ఎసిబి అదికారులు గమనించారు. దాంతో ఆయనను కూడా విచారించాలని తలపెట్టారు. కాగా కేసులో ముద్దాయిగా ఉన్న జిమ్మి కోసం ఎసిబి అన్వేషణ చేస్తోంది. అతనిని అరెస్టు చేయాలని భావిస్తోందని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఓటుకు నోటు కేసులో విచారణ నిమిత్తం ఏసీబీ అధికారులు నిన్న టీడీపీ కార్యాలయానికి అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లారు. కేసు విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు లోకేష్‌ కాన్వాయ్‌లోని డ్రైవర్‌ కొండల్‌రెడ్డిని విచారించనున్నారు. ఈ మేరకు నిన్న టీడీపీ కార్యాలయానికి, బాబు ఇంటికి వెళ్లిన అధికారులకు కొండల్‌రెడ్డి ఆచూకీ లభించలేదు. దీంతో అధికారులు నేడు కొండల్‌రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు.