ఓట్లతోనే తెలంగాణ సాధ్యమా?
తెలంగాణ రాష్ట్ర సమితి. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా 12 ఏళ్ల క్రితం పురుడుపోసుకున్న పార్టీ. 1969 తర్వాత వివిధ రూపాల్లో సాగిన ఉద్యమాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు మేధావులు, ఉద్యమకారులు, కళాకారులు కలిసి ఒక రాజకీయ వేదికగా టీఆర్‌ఎస ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఉద్యమంతో పాటు రాజకీయ ప్రక్రియ కొనసాగించాలని అంతా కలిసి ఉద్యమాన్ని ముందుకు నడిపారు. కొన్నాళ్ల తర్వాత టీఆర్‌ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగా మారింది. ఎత్తులు, జిత్తులు, పొత్తులు.. అన్ని పార్టీలకు మళ్లే టీఆర్‌ఎస్. తర్వాతికాలంలో కొందరు టీఆర్‌ఎస్‌కు దూరం జరిగి ప్రత్యేక ఉద్యమ వేదికలు ఏర్పరచుకున్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా కళా రూపాలతోనే ఉద్యమ వ్యాప్తిలో భాగస్వాములయ్యారు. సమయం గడిచేకొద్ది టీఆర్‌ఎస్ పీకల్లోతు రాజకీయాల్లో కూరుకుపోయింది. ఓట్లు.. సీట్లే ప్రధానం అనే స్థాయిలో ఉద్యమ ప్రస్థానం కొనసాగించింది. అందరూ కలిసి, వేర్వేరు వేదికలుగా నిర్వహించిన ఉద్యత తీవ్రత ఢిల్లీని తాకింది. ఇది కేసీఆర్ గొప్పతనంగా ఆ పార్టీ చెప్పుకుంటోంది. తెలంగాణ అంశాన్ని ఢిల్లీ స్థాయికి చేర్చిన యోధుడిగా కేసీఆర్‌ను కీర్తిస్తోంది. కానీ టీఆర్‌ఎస్‌లో ఇప్పుడు మైకులు పట్టుకొని మాట్లాడేవారికి తెలియంది ఏమిటంటే ఇంతకన్నా మూడున్నర దశాబ్దాల మునుపే తెలంగాణ జాతీయ స్థాయిలో మోతలు మోగింది. తెలంగాణ సాధన కోసమే 1969లో ఉద్యమం సాగించిన తెలంగాణ ప్రజాసమితి ఆ తదుపరి సంవత్సరం జరిగిన ఎన్నికల్లో 11 ఎంపీ స్థానాల్లో 10 గెలుచుకొని అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకుంది. ఈ విషయం తెలియని వాళ్లు కేసీఆర్ మాత్రమే తెలంగాణ అంశాన్ని ఢిల్లీకి చేర్చినట్టు గొప్పలు చెప్పుకుంటారు. ఊరువాడ ఏకమై 2009లో గర్జించడంతో ఢిల్లీ సర్కారు దిగివచ్చి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. తర్వాతి సీమాంధ్రుల కుట్రలు, కుతంత్రాలతో ఇచ్చిన ప్రకటన నుంచి వెనక్కు తగ్గింది. ఈ నేపథ్యంలో ఐక్య ఉద్యమ వేదిక ఏర్పాటుకు అన్ని రాజకీయ పక్షాల్లోని తెలంగాణ నేతలు ముందుకొచ్చారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నుంచి ఉద్యమ సేనానిగా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితిని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రాంత పౌరులకు భిన్నంగా రాజకీయ నేతలు తయ్యారయ్యారు. ఉద్యమాలే ఊపిరిగా బతికిన తెలంగాణ గడ్డపై.. ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా పోరుసాగించే ప్రాంతం నుంచి ఇక్కడి ప్రజల ఓట్లతో నాయకులుగా ఎదిగిన వారు ఆయా పార్టీల్లోని సీమాంధ్ర పెద్దలకు తాబేదార్లు. వారు విదిల్చే ఎంగిలి మెతుకుల్లాంటి పదవుల కోసం, కాంట్రాక్టుల కోసం నిత్యం కాదు కాదు.. క్షణానికోసారి వారి భజన చేయమన్నా చిత్తం అంటారు. ఇలాంటి బానిసత్వం వారికి ఎక్కడి నుంచి తెలియదు కాదు.. ఓట్లేసిన ప్రజల కోసం.. వారి ఆకాంక్షల కోసం కనీసం నోరు విప్పి మాట్లాడలేనంతగా సీమాంధ్ర పెద్దల కబంద హస్తాల్లో చిక్కుకుపోయారు. దీంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఎక్కువ కాలం జేఏసీలో ఇమడలేక బయటికి వచ్చి తమ సహజ బుద్ధిని చాటుకున్నారు. ఎప్పట్లాగే సీమాంధ్ర పెద్దలకు జై కొడుతూ జేఏసీలో కొందరి పెత్తనమే నడుస్తోందని ఆక్షేపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయా పార్టీలు తెలంగాణపై పెద్దగా గొంతు విప్పిన సందర్భాలు తక్కువే. తెలంగాణ కోసమే ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ కూడా వాటి సరసనే చేరుతోంది. ఓట్లు సీట్ల రాజకీయాలు మినహా ఆ పార్టీ మరొకటి మాట్లాడ్డం లేదు. 2014 ఎన్నికల్లో తమ పార్టీ సాధించే సీట్లే తెలంగాణ తెచ్చిపెడుతుందని గులాబీ దళపతి కేసీఆర్ జోష్యం చెబుతున్నాడు. వంద ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు సాధిస్తే ఢిల్లీ దిగివచ్చి తెలంగాణ ఇవ్వదా అంటూ ప్రజలకే ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఏ రాజకీయ పార్టీ అయినా ఓట్లు, సీట్ల కోసం పాకులాడటంలో తప్పులేదు. కానీ ఉద్యమ పార్టీ ఈ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాల్సిందే. ఓట్లు.. సీట్లే ప్రధానమనే సంకేతాలు ప్రజల్లోకి పంపి.. వారిని పదేపదే ప్రశ్నించి లబ్ధిపొందాలని ప్రయత్నిస్తే మొదటికే మోసం జరిగే అవకాశాలు లేకపోలేదు. టీఆర్‌ఎస్ వేర్వేరు పార్టీలతో జట్టుకట్టడాన్ని తెలంగాణ ప్రజలు చీత్కరించారు. దాని ఫలితమే 2009 ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురైన ఘోర పరాభవం. సీట్లతోనే తెలంగాణ సాధిస్తామనే కేసీఆర్ 2004లో 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వారిని నిలుపుకోలేకపోయాడనేది వందశాతం నిజం. కొద్దిరోజుల్లోనే సగం మంది ఎమ్మెల్యేలను అధికారపార్టీ తమవైపు తిప్పుకుంటే చేష్టలుడిగి చూడ్డం.. నోటికి వచ్చింది తిట్టడం మినహా కేసీఆర్ చేసిందేమి లేదు. వాళ్లే కుమ్మక్కై కాసాని జ్ఞానేశ్వర్‌లాంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా గెలిపించిన విషయం మరువొద్దు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రోజుల్లోనూ కేసీఆర్‌తో ఎమ్మెల్యేను నిలుపుకోలేకపోయాడు. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని ధిక్కరించి పార్టీ అధికారిక అభ్యర్థి మహమూద్‌ను కాదని కాంగ్రెస్ పార్టీ తరఫున నిలిపిన ఆరో అభ్యర్థికి ఓట్లేసిన విషయం ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. గెలిచిన ఎమ్మెల్యేలను నిలుపుకోలేని పార్టీ, సొంతపార్టీ ప్రజాప్రతినిధులపై అజమాయిషీ లేని పార్టీ రేపు వందమందిని గెలిపిస్తే తన వెంటే ఉంచుకుంటుందనే నమ్మకం ఏంటి? వారు అమ్ముడుపోరని ఎవరు చెప్పగలరు? కేసీఆర్ ఇకనైనా ఓట్లు.. సీట్ల రాజకీయానికి స్వస్తిచెప్పి ఉద్యమ బాటన సాగితేనే ఆ పార్టీకి ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు కచ్చితంగా ఓట్లుగా రూపాంతరం చెందుతుంది. ఈ దిశగా ఉద్యమ పార్టీ అడుగులు వేస్తే మంచిది.