ఓయూలో కొలిమంటుకుంటోంది…

ప్రపంచ చరిత్రలో ఏ ఉద్యమాన్ని చూసినా దానిలో విద్యార్థుల పాత్ర మరువలేనిది…అది అస్సాం కానివ్వండి..అఫ్గాన్‌ కానివ్వండి..ఎక్కడైనా విద్యార్థులు లేనిదే ఉద్యమాలు విజయవంతం అయినట్టు మనకు ఏ చరిత్రలోనూ కనబడదు..తెలంగాణ ఉద్యమ చరిత్రను తరచిచూస్తే 1969 అయినా, 2009లో ప్రారంభమైన మలి దశ ఉద్యమంలోనైనా విద్యార్థులదే కీలక పాత్ర..1969 ఉద్యమంలో దాదాపు 369 మంది విద్యార్థులు సీమాంధ్ర పాలకుల దాష్టీకానికి బలయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై వీరోచితంగా పోరాడి అమరులయ్యారు. అనంతరం 2009లో ఉధృతంగా ప్రారంభమైన మలిదశ తెలంగాణ పోరాటంలో ఓయూ జేఏసీ కీలక పాత్ర పోషించింది. విద్యార్థులు ధర్నాలు, ర్యాలీలతో అట్టుడికిపోయింది. ఖాకీల చేతీలోని లాఠీలు విద్యార్థులపై కరాళనృత్యం చేశాయి. ఒక్కో విద్యార్థిపై లెక్కలేనన్ని కేసులు బనాయించి భయబ్రాంతులకు గురిచేశారు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఉద్యమాన్ని కొనసాగించారు. అయితే విద్యార్థులు ఇంతలా ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే నేతలు మాత్రం ఉపన్యాసాలకే పరిమితమయ్యారు. తెలంగాణ కొరకు తాము ప్రాణత్యాగాలకు సైతం సిద్దమంటూ బడాయిలు కొట్టారు.అయితే కనీసం తమ పదవులకు కూడా రాజీనామా చేయలేదు. అయితే గత కొంత కాలంగా స్థబ్దుగా ఉన్న ఓయూ జేఏసీ చాలా రోజుల తర్వాత విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఓయూ లోని పలు విద్యార్థి సంఘాలు కలిసి ఉద్యమ కార్యాచరణపై చర్చించాయి. ఎపుడైనా తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతున్నపుడల్లా ఇక తెలంగాణ రాదంటూ ఊదరగొడ్తూ విద్యార్థులు, తెలంగాణ ఉద్యమ బిడ్డల ఆత్మస్థైర్యం దెబ్బతీసే సీమాంధ్ర మీడియా ఇపుడు సైతం తెలంగాణ ఇవ్వడం కుదరదంటూ కేంద్రం రాష్ట్రపతికి నివేదిక ఇవ్వనున్నట్లు గగ్గోలు పెట్టి సీమాంధ్ర మీడియా మరోసారి తన కుట్రను అమలుపరిచేందుకు ప్రయత్నిస్తోంది. 1969, 2009 ఉద్యమాలలో ప్రధానమైన తేడా ఏంటంటే ఆనాడు తెలంగాణ కోసం విద్యార్థులు తెలంగాణవాదులు వీరోచితంగా పోరాడి సీమాంధ్ర పాలకుల దుర్మార్గానికి బలై వీర మరణం పొందితే 2009 నుండి ప్రారంభమైన మలి దశ ఉద్యమంలో జరుగుతున్న ఆత్మహత్యలు ఆందోళన కలిగించేవే. ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే సీమాంధ్ర పెట్టుబడిదారులు, మీడియా కుట్రలు ఫలించినట్లే. అందుకే ఈజిప్ట్‌ తరహా ఉద్యమానికి సిద్దమవుదామనీ, ఆత్మహత్యలు కాదు తెగించి పోరాడదామంటూ తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపు తెలంగాణవాదులు, విద్యార్థులందరికీ మార్గదర్శనం కావాలి..తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ తెలంగాణ వచ్చే వరకు కొట్లాడాలి..ఆత్మహత్యలు, ఆకలికేకలు లేని తెలంగాణే మన లక్ష్యం..మన ధ్యేయం కావాలి. అందుకే తెలంగాణ వచ్చే వరకు ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలకు ఊపిరి పోయాలి. ఈజిప్ట్‌లో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేంతవరకు రోడ్లపై నుంచి కదలని విధంగా తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ వచ్చేంత వరకు తాము కదలబోమంటూ ఉద్యమాన్ని తీవ్రం చేయాలి. సీమాంధ్ర నేతల గుండెల్లో తెలంగాణ వాదం నివురుగప్పిన నిప్పులా ఉంది. దాన్ని మహాజ్వలితంగా మార్చి సీమాంధ్ర పెత్తందారి పాలనను మాడ్చి మసిచేయాలి. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 30న జేఏసీ నిర్వహించతలపెట్టిన తెలంగాణ మార్చ్‌ను తెలంగాణ ప్రజలు విజయవంతం చేయాలి. విద్యార్థి సంఘాలు తమ భవిష్యత్తు కార్యచరణలో భాగంగా సెప్టెంబర్‌ 27న నిర్వహించతలపెట్టిన తెలంగాణ విద్యార్థి కవాతులో తెలంగాణ విద్యార్థులు పాల్గొని వీరోచితంగా తెలంగాణ కొరకు పోరాడాలి. పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకోవడం కాదు..మొండి ధైర్యంతో తెగించి పోరాడాలి…విద్యార్థులు పోరాడితే ఎలా ఉంటుందో మరోసారి పాలకులకు రుచిచూపాలి..తెలంగాణ వచ్చేవరకు విద్యార్థులు తెగించి పోరాడాలి. పోరాడితే పోయేదేముంది..సీమాంధ్ర బానిస సంకెళ్లు తప్ప ..