ఔట్‌సోర్సింగ్‌ విధానానికి వ్యతిరేకంగా ఆందోళన : ఎఐటీయూసీ

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌15:  సింగరేణిలో ఔట్‌సోర్సింగ్‌ విధానానికి తాము వ్యతిరేకమని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) ప్రకటించింది. దీంతో కార్మికుల హక్కులకు భంగం వాటిల్లనుందన్నారు. ఔట్‌సోర్సింగ్‌కు వ్యతిరేకంగా సిఐటియూ  ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఉద్యమాలు చేపట్టబోతున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు.  యాజమాన్య విధానానికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా కార్మికుల నుంచి సంతకాలు సేకరించామన్నారు.  అన్ని గనులపై, విభాగాల్లో అధికారులకు వినతిపత్రాలు సమర్పణ, ఈ నెల 27న నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అప్పటికీ యాజమాన్యం నుంచి స్పందన రాకపోతే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామన్నారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికీ వారసత్వ ఉద్యోగాల సమస్య పట్టించుకోవడం లేదన్నారు. ఇదిలావుంటే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు త్వరలోనే హెచ్చెమ్మెస్‌ ఆధ్వర్యంలో డోర్లి నుంచి సత్తుపల్లి వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌ తెలిపారు. సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం కంపెనీలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలన్నారు. తండ్రీకొడుకుల ఉద్యోగాల సాధన కోసం పాదయాత్ర చేసి అనంతరం చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహించి ముఖ్యమంత్రి కలుసుకొని సమస్యను వివరిస్తామన్నారు. సకలజనుల సమ్మె కాలపు వేతనాలను కార్మికులకు తక్షణమే ఇవ్వాలన్నారు. కార్మికుల దినోత్సవం రోజును సింగరేణి కార్మికులందరికీ యాజమాన్యం బంగారు నాణాన్ని బహుమతిగా ఇవ్వాలన్నారు