కంది రైతులకు మోసం 

చెల్లింపులపై రైతుల ఆగ్రహం
ఆదిలాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, కఠిన ఆదేవాలు ఇచ్చినా కంది రైతులకు న్యాయం జరగడం లేదు. బినావిూ రైతుల పేరుతో దళాకారుల కందులను రాత్రికి రాత్రే కొనుగోలు చేస్తున్నారని, డబ్బులు ఇచ్చిన వారి కందులను ముందుగా తూకం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. రోజుల తరబడి నిజమైన రైతులు నిద్రహారాలు మాని యార్డులో ఉన్న వారి కందులను కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మార్క్‌ఫెడ్‌, డీసీఎంఎస్‌ ద్వారా చేపట్టిన కందుల కొనుగోళ్లు రసాభాసగానే మారుతోంది. కంది రైతులకు ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. గత నాలుగైదు రోజుల నుంచి యార్డుకు తెచ్చుకున్న కందులను కొనుగోలు చేయకుండా గనీ సంచుల కొరత ఉందని అధికారులు కొనుగోల్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై బైఠాయించి రోడ్డుకు అడ్డంగా ముళ్లకంచెను వేసి నిరసన తెలిపారు. దీంతో  కిలోవిూటర పొడవునా జాతీయరహదారిపై రెండువైపుల వాహనాలు గంటన్నర పాటు నిలిచి పోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ డబ్బులు ఇవ్వని వారి కందులను నాణ్యత లేదనే సాకుతో పక్కన పెడుతున్నారని పేర్కొన్నారు. గనీ సంచులున్న లేవని చెబుతున్నారని, రైతులే గనీ సంచులను కొనుగోలు చేసి తెచ్చుకున్నప్పటికి కొనుగోళ్లు నిలిపివేశారని ఇదేక్కడి న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కందులను కొనుగోలు చేయాలని లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.