కక్షసాధింపుతోనే రేవంత్‌ ఇంటిపై ఐటీదాడులు 

– కేసీఆర్‌ కుట్రలను ప్రజలే తిప్పికొడతారు
– కాంగ్రెస్‌ నేత సంపత్‌ కుమార్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి) : కక్షసాధింపు చర్యలో భాగంగానే కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరిగాయని కాంగ్రెస్‌ నేత సంపత్‌కుమార్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈదాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రేవంత్‌ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ నెల 18, 19 తేదీల్లో పోలీస్‌, ఇంటెలిజెన్స్‌ అధికారులను కేసీఆర్‌ ప్రగతిభవన్‌కు పిలుచుకుని ఏకాంతంగా మాట్లాడినట్లుగా తమకు సమాచారం ఉందన్నారు. ఆ కుట్రలో భాగంగానే రేవంత్‌ ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌, సంపత్‌లను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో
గెలవకూడదని పోలీస్‌ అధికారులకు కేసీఆర్‌ ఆదేశాలిచ్చినట్లు తెలిసిందన్నారు. మా ముగ్గురి నేతలపై కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ అంశం టైమ్స్‌ నౌ పత్రికలో కూడా వచ్చిందని స్పష్టం చేశారు. మావిూద పోలీస్‌ అధికారులను, ఏ సంస్థలనైనా ఉసిగొలిపితే కాంగ్రెస్‌ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఏ స్థాయికైనా వెళ్తామని సూచించారు. ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వ పాలనను ఎప్పుడూ చూడలేదన్నారు. దేవుడ్నే ఎదిరిస్తామని టీఆర్‌ఎస్‌ నేతలు కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటోళ్లను దేవుడు కూడా క్షమించడని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పాలనను అంతం చేసే వరకూ పోరాటం చేస్తామని సంపత్‌ శపథం చేశారు.