కక్ష సాధింపు ఆపండి

` నేషన్‌నల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా, రాహుల్‌లపై వేధింపులకు నిరసనగా భాజపా కార్యాలయాల ముందు కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళనలు
` కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు
– గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత
` రాజకీయంగా వేధిస్తున్నారు
` ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాం
` టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ను ఈడీ కేసులతో వేధిస్తున్నారని దీనికి ఏఐసీసీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ నుంచి బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు యత్నించాయి. గాంధీ భవన్‌ గేట్లు పోలీసులు మూసేశారు. దీంతో గాంధీ భవన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో గాంధీ భవన్‌ గేటు ముందు కాంగ్రెస్‌ నేతలు బైఠాయించారు. దీంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళనతో గాంధీభవన్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడిరది. ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌, పార్టీ రాష్ట్రవ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్‌, సీనియర్‌ నేతలు, మహిళా నేతలు పాల్గొన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో గాంధీ కుటుంబాన్ని వేధిస్తున్నారని మహేశ్‌కుమార్‌ వివర్శించారు. సోనియా, రాహుల్‌గాంధీపై రాజకీయంగా కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు బీజేపీ కార్యాలయానికి వెళ్తున్నామని తెలిపారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని, నేషనల్‌ హెరాల్డ్‌ పేపర్‌ కేసు విషయంలో అదే జరిగిందని . రేపు కూడా అదే జరుగుతుందని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌? అన్నారు. బీజేపీ పెడుతున్న అక్రమ కేసుల గురించి ప్రజలకు వాస్తవాలు చెప్తామని, గాంధీ కుటుంబంపై బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. గాంధీ పేరుని సైతం తొలిగిస్తుందని, న్యాయం గెలవడానికి సమయం పట్టొచ్చని, కానీ చివరికి గెలిచేది న్యాయమేనని వెల్లడిరచారు. నేషనల్‌ హెరాల్డ్‌ పేపర్‌ గురించి బీజేపీకి ఏమి తెలియదని, తమ మార్గమే అహింస మార్గం, అలాగే శాంతియుతంగా నిరసన చేసి ప్రజలకు వాస్తవాలు తెలిచేస్తామని వివరించారు.మరోవైపు కాంగ్రెస్‌ నేతల ర్యాలీతో బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌ శ్రేణుల ముట్టడి యత్నంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేపీ కార్యాలయానికి వెళ్లే మార్గంలో బారికేడ్లు పెట్టారు. కాంగ్రెస్‌ శ్రేణులు వస్తున్నాయనే సమాచారంతో బీజేపీ కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. వారిని అడ్డుకునేందుకు భారీగా వచ్చాయి. బారికేడ్ల వైపు బీజేపీ కార్యకర్తలు కర్రలతో దూసుకెళ్లారు. దీంతో పలువురు నిరసనకారులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర రాజకీయ కక్షతోనే సోనియా, రాహుల్‌ను వేధిస్తున్నారని కరీంనగర్‌లో నిరసనకు దిగిన నేతలు ఆరోపించారు. నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆందోళనకు దిగిన కార్యకర్తలను అక్కడ్నుంచి కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరిన క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే సుడా ఛైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డితో పాటు నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ శ్రేణులు నినాదాలు చేశాయి. అటు బీజేపీ ఎంపీ కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.నల్గొండలోని బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ నేతల నిరసనకు దిగారు. కాంగ్రెస్‌ అగ్రనేతలను కావాలనే ఈడీ వేధిస్తోందంటూ ఆరోపించారు. బీజేపీ కార్యాలయం వద్ద కోడిగుడ్లు విసిరిన కాంగ్రెస్‌ శ్రేణులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్‌ నేత ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.నిజామాబాద్‌లోనూ ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టైన కాంగ్రెస్‌ శ్రేణులపై బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. ప్రతీకార రాజకీయాల కోసం దర్యాప్తు సంస్థలను కేంద్రం వాడుకుంటోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.