కట్జూ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరికొన్ని ప్రాంతాల్లో ఇలాంటి డిమాండ్లే ఉత్పన్నమవుతాయని తద్వారా దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ జస్టిస్‌ మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రజల ఆకాంక్షలపై మాట్లాడాల్సి వస్తే ఆచితూచి మాట్లాడాలి. లేదా ఆ అంశాన్ని స్పృశించకుండానే వదిలేయాలి. వివాదాస్పదన వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్న కట్జూ తెలంగాణ అంశాన్ని సంచలనం కోసమే ఉపయోగించుకోవాలని చూశాడు. తద్వారా తనకు మీడియా హైప్‌ కొనసాగించుకోవాలనుకున్నాడు.
సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన కట్జూ ఆ కాలంలో పెద్దగా ప్రజాదరణకు నోచుకోలేదు. ఆ లోటును ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ పదవిలో ఉండగా భర్తీ చేసుకోవాలని తలచిన ఈ విశ్రాంత న్యాయమూర్తి అవకాశం చిక్కిన ప్రతిసారి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూనే ఉన్నాడు. అలాగే తెలంగాణపై మాట్లాడాడు. అయితే ఆయన ఎక్కడ ఏం మాట్లాడినా ఎదురుగాని ప్రతిఘటన తెలంగాణ ఎదుర్కోవాల్సి వచ్చింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వ్యక్తం చేసేందుకు, నడుస్తున్న ఉద్యమాన్ని నమోదు చేసి భావి తరాలకు అందించేందుకు దక్కన్‌ టీవీ తీసుకురావాలని కొందరు ఔత్సాహికులు ముందుకు వచ్చారు. ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ను ఈ టీవీ చానెల్‌ లోగో ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
వారి ఆహ్వానం మేరకు కార్యక్రమానికి రూపకల్పన చేసుకున్న కట్జూ హైదరాబాద్‌లో మరికొన్ని అధికారిక కార్యక్రమాలు పెట్టుకొని విమానం ద్వారా భాగ్యనగరిలో వాలిపోయారు. వస్తువస్తూనే తన సహజశైలి ప్రకారం తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు భగ్గుమన్నారు. పది జిల్లాల ప్రజలు ఆందోళనకు దిగారు. న్యాయమూర్తిగా ఉండి దిగజారి మాట్లాడుతావా? అంటూ గొంతెత్తి ప్రశ్నించారు. రాజకీయ పార్టీలే కాదు టీజేఏసీతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కట్జూపై మండిపడ్డాయి. తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. అయినా ఆయన నుంచి స్పందనలేదు. దీంతో ఆయన్ను హైదరాబాద్‌కు ఆహ్వానించిన దక్కన్‌ టీవీ యాజమాన్యమే మీరు మా కార్యక్రమానికి రావొద్దంటూ తెగేసి చెప్పింది. అప్పటి వరకు తాను మాట్లాడిన ప్రతిదానికి అహో ఓహో అన్నవారిలో మీడియా కూడా ఉంది. కట్జూ వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు పట్టించుకోకపోగా కొన్ని చానెళ్లు మాత్రం వివిధ పరిస్థితుల నేపథ్యంలో ప్రాధాన్యం ఇచ్చి ప్రసారం చేశాయి.
సీమాంధ్ర పెత్తందారి మీడియా ఆయన అధికారిక కార్యక్రమాల కవరేజీకి మాత్రమే పరిమితమైపోయింది. కట్జూ ఏదో అనామకుడైతే ఎట్లా మాట్లాడినా ఎవరూ పట్టించుకోరు. ఆయన భారత సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేశారు. రాజ్యాంగం ప్రకారం అనేక తీర్పులు వెలువరించారు. అలాంటి వ్యక్తి కేవలం ఒక వర్గం వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎదుటి పక్షం వాదనకూడా వినకుండా ఏకపక్షంగా తీర్పునిచ్చేశారు. తెలంగాణ ఏర్పడితే దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందంటూ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితుల అధ్యయనానికి వేసిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో చాప్టర్‌లోని అంశాలను కట్జూ ప్రస్తావించారు. తద్వారా తాను న్యాయం వైపు కాకుండా దోపిడీ వైపు, ఆధిపత్య, పెట్టుబడిదారీ వర్గాలపైపు నిలబడుతానని ఆయన చెప్పకనే చెప్పారు. ఆర్టికల్‌ 3 ప్రకారం పార్లమెంట్‌కు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం ఉంది.
పార్లమెంట్‌లో తీర్మానం ద్వారా దేశంలోని ఏ భాగాన్నైనా విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయవచ్చు. న్యాయమూర్తిగా పనిచేసిన కట్జూకు ఈ విషయం తెలియంది కాదు. కానీ కావాలనే ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నట్లుగా ఆయన మాట్లాడారు. తాను ఇంతకాలం ఏం మాట్లాడితే ఏం చేశారు. ఇప్పుడు ఏం చేస్తారు అనే ఆధిపత్య ధోరణి ఆయన వ్యాఖ్యల్లో ధ్వనించింది. కానీ తెలంగాణ ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. తమ ఆకాంక్ష ఫలించేవేల.. తమ బిడ్డల బలిదానాలకు ఒక అర్థం వచ్చే తరుణంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న కట్జూ ఇలాంటి మాటలు మాట్లాడటాన్ని మొత్తం తెలంగాణ ప్రజానీకం గొంతెత్తి ప్రశ్నిస్తోంది. కట్జూ ఒక్కరికే కాదు ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా ప్రవర్తించిన, వ్యాఖ్యానించిన ఎవరికైనా ప్రతిఘటన తప్పదు.