కడపలో డ్రామాలు ఆపండి
కేంద్రం స్టీల్‌ప్లాంట్ ఇస్తామంటుంటే దీక్షలెందుకు
రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు సైంధవుడిలా దాపురించాడు
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
శ్రీకాకుళం, జూన్21(జనం సాక్షి) : వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం ఎవరూ ప్రాణ త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు.. కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తే చాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటనలో భాగంగా కన్నా మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కోసం తెలుగుదేశం పార్టీ అసలు ప్రయత్నమే చేయలేదని స్పష్టం చేశారు. కేంద్రం స్టీల్ ప్లాంట్ ఇస్తామంటుంటే.. కావాలనే కడపలో డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఈ డ్రామాలో సీఎం రమేష్ పాత్రధారి కాగా, చంద్రబాబు డైరెక్టర్ అని.. ఇకనైనా డ్రామాలు ఆపాలన్నారు. చంద్రబాబు నాయుడుకి అవినీతి, రాజకీయం తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. రాష్ట్ర ప్రజల విూద చంద్రబాబు కక్ష సాధింపు ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి సైంధవుడిలా దాపురించారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగు ఏళ్లలో శ్రీకాకుళం జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. వంశధార, తోటపల్లి ప్రాజెక్టులను పూర్తిచేశారా..? ఉద్ధానం కిడ్ని బాధితుల సమస్యను పరిష్కరించారా..? అని ప్రశ్నించారు. వంశధార ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెద్ద అవినీతి పుట్ట అని విమర్శించారు. చంద్రబాబు చేతకానితనం వల్ల 21 వేల మంది సాక్షరభారత్ ఉద్యోగులు బజారున పడ్డారని తెలిపారు.