కడపలో నెరవేరని ఉక్కు సంకల్పం
రాజకీయ ప్రాబల్యం కోసమే టిడిపి యత్నం
విపక్షాల ఎదురుదాడి
అమరావతి,నవంబర్3(జనంసాక్షి): ప్రభుత్వం తన అవినీతి, అసమర్థత, తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఒక పథకం ప్రకారం ఇతరులపై నిందలు మోపడం అలవాటుగా మార్చుకుందని వైకాపా, లెఫ్ట్ నేతలు దుయ్యబట్టారు. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రాగానే చంద్రబాబు అందుకు విరుగుడు ఆలోచిస్తున్నారే తప్ప సమస్యల గురించి ఆలోచన చేయడం లేదని అంటున్నారు. ఇబ్బందిపెట్టే అంశాలు తెరవిూదకొచ్చినప్పుడు వాటినుంచి తప్పించుకోవడానికి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. కడపలో ఉక్కు దీక్షలు ఇందులో బాగమే తప్ప బాబుకు చిత్తశుద్దికు లేదన్నారు. నిజాలు వెలుగులోకి తెచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందిస్తే కుట్రలకు తెగబడుతున్నారని ఎదురుదాడికి దిగడం అధికార పార్టీకి అలావాటుగా మారిందని చెప్పారు. అందుకు వాటి అనుకూల ప్రసార మాధ్యమాలు, మేధావి వర్గాన్ని సైతం వాడుకుంటున్నారని తెలుగుదేశం అధినేతపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కడపలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్ నిర్వహించిన ఆమరణ నిరాహారదీక్ష వెనుక ఉక్కు ఫ్యాక్టరీ సాధన కన్నా జిల్లాలో పార్టీ అంతర్గత కలహాలు, ఇతర పలు అంశాల పరిష్కారం ఇమిడి
వున్నాయన్నారు. దీక్ష ప్రారంభించడం, ముగించడం కూడా ఒక పథకం ప్రకారం ముఖ్యమంత్రి సూచనలతో సాగిందన్నారు. నాలుగు సంవత్సరాలు మిన్నకుండి ఎన్నికల ముందు దీక్షకు దిగడం ద్వారా సీమ జిల్లాల్లో ఇంతకాలం ఉక్కు ఫ్యాక్టరీ కోసం పలు రూపాలలో ఆందోళనలను హైజాక్ చేయబోయారని అభిప్రాయపడ్డారు. ఒక వైపు కేంద్రానికి వ్యతిరేకంగా ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష సాగినట్లు ప్రజలను మభ్యపరచడం, అదే సమయంలో జిల్లాలో గ్రూపులుగా విడిపోయిన నేతలనందరినీ ఒకే వేదిక పైకి తీసుకురావడం అన్న రాకీయకోణంలో జరిగిందన్నారు. అయితే ముఖ్యమంత్రి ఎంత పక్కాగా దీక్ష నిర్వహణను నియంత్రణలో పెట్టుకున్నా తుదకు ఫలితం ఏవిూ దక్కలేదు. జిల్లా నేతలు కూడా ఎవరికి వారుగా వుండిపోయారు. ప్రత్యేక ¬దా విభజన చట్టం అమలు జరగాలని గతంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ప్రదర్శనలు చేసిన వామపక్ష నేతలను ముఖ్యమంత్రి జైలుకు పంపిన సందర్భముంది. రాయలసీమలో సంఘటితమౌతున్న వివిధ ప్రజాసంఘాల నేతలు టిడిపి దీక్షకు ఏమాత్రం సానుభూతి చూపలేదు. కంటి తుడుపుగా రాష్ట్ర ప్రభుత్వమే ఫ్యాక్టరీ నిర్మిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటన చేసినా ఇప్పట్లో అది నెరవేరలేదు.