కడప స్టీల్ ప్లాంట్ కోసం ఉమ్మడి పోరు
అఖిలపక్ష భేటీలో మంత్రి ఆదినారాయణ ప్రకటన
కడప,జూన్15(జనం సాక్షి): కడపలో స్టీల్ ప్లాంట్ కోసం అందరితో కలిసి ఉద్యమిస్తామని మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు. అఖిలపక్ష భేటీకి జగన్‌తో సహా అన్ని పార్టీ నేతలను ఆహ్వానించామని, వైసీపీ నేతలతో పాటు మరికొందరు హాజరుకాలేదని తెలిపారు. స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు కావాల్సిన వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం టీడీపీ ఉద్యమాన్ని ఉధృతం చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఎంపీలు, మంత్రులతో సమావేశం జరిగింది. 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి వినతిపత్రం ఇస్తామని, ప్రధాని స్పందించకపోతే 24న కడపలో ఆమరణ దీక్ష చేపడతామని ఎంపీ సీఎం రమేష్ ప్రకటించారు. అయితే కడప జిల్లాలో పట్టు సాధించుకోవడానికే సీఎం రమేష్ దీక్ష చేస్తున్నారని, స్టీల్‌ప్లాంట్ రావడం టీడీపీకి ఇష్టం లేదని బీజేవైఎం నేత నాగోతు రమేష్ నాయుడు ఆరోపించారు. కడపలో స్టీల్‌ప్లాంట్ రాబోతుందని తెలిసే టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌డీ విల్సన్ మండిపడ్డారు. కడప జిల్లాలో ఉక్కుపోరు కొనసాగుతోంది. స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేష్, శ్రీనివాసరెడ్డి, వామపక్ష, ఇతర ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఎంపీ సీఎం రమేష్ అమరణ దీక్షపై శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకోసం జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించారు.అయితే ఈ సమావేశానికి టీడీపీ నేతలు, ఒకరిద్దరు ప్రజా సంఘాల నేతలు తప్ప మిగతా రాజకీయ, ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు హాజరు కాలేదు. నాలుగేళ్లుగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం పోరాడని టీడీపీ ఈరోజు సమావేశం పెడితే ఎలా అంటూ వామపక్షాలు కార్యక్రమాన్ని బహిష్కరించాయి. బీజేపీతో సంసారం చేసి విడిపోయి జిల్లాకు మోసం చేసారని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.