కడు పేదరికంలో ముస్లింలు

4

– నెలకు వెయ్యి రూపాయల ఆదాయం లేని కుటుంబాలు

– 12 శాతం రిజర్వేషన్‌కు కట్టుబడ్డాం

– సమగ్ర అధ్యయనం చేయండి: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ 27 జూలై (జనంసాక్షి):

రాష్ట్రంలో ముస్లీంలు కడు పేదరికంలో ఉన్నరని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు.  ముస్లింల అభివృద్ధికి ఆయన పథకాలు రచిస్తున్నారు. ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేయడానికి నియమించిన కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ పనితీరు, కార్యాచరణపై సవిూక్ష జరిపారు. హైదరాబాద్‌ బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో జరిగిన ఈ సమావేసంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిషన్‌ చైర్మన్‌ జి.సుధీర్‌, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఉమర్‌ జలీల్‌, కేంద్ర ప్రభుత్వం నియమించిన కుంద్‌ కమిటీ సభ్యులు అవిూరుల్లాఖాన్‌, అబ్దుల్‌ షాబాన్‌ లతో కూలంకుషంగా చర్చించారు. ఆగస్టు మొదటి వారంలో కమిషన్‌ సమావేశం కావాలని సీఎం ఆదేశించారు.

అత్యంత పేదరికంలో మగ్గుతున్న ముస్లింల ఆర్థిక, సామాజిక, విద్యా స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేయాలని కమిషన్‌ ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. తెలంగాణ ముస్లింల కోసం అవసరమైన కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 12 శాతం ముస్లింలు ఉన్నారని, అందులో ఎక్కువ శాతం నిరుపేదలే ఉన్నారని వివరించారు.

తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సచార్‌ కమిటీ నియామకానికి యూపీఏపై ఒత్తిడి తెచ్చిన విషయాన్ని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కమిటీ అధ్యయనంలో దేశవ్యాప్తంగా ముస్లింలకు సంబంధించిన అనేక అంశాలు బయటకు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో జరిపే అధ్యయనం శాస్త్రీయంగా జరగాలని సూచించారు.

కమిషన్‌ ప్రతీ జిల్లాలో 3-4 నియోజకవర్గాల్లో పర్యటించాలని, పట్టణ, గ్రావిూణ ముస్లింలను కలవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. వారి స్థితిగతులపై వివరాలు సేకరించడంతోపాటు.. జీవన విధానాన్ని ఫొటోలు, వీడియోలు తీయాలని చెప్పారు. మూడు, నాలుగు ఏజెన్సీలతో సర్వే నిర్వహించాలన్నారు. రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు, ముస్లింల నుంచి వినతులు తీసుకోవాలని, జిల్లాల్లో పర్యటించి నేరుగా ముస్లింలతో మాట్లాడాలని ముఖ్యమంత్రి చెప్పారు.

ముస్లింల జీవన ప్రమాణాలు పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారి నుంచే అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. అధ్యయనం పూర్తయిన తర్వాత ముస్లింల కోసం చేయాల్సిన దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు. తెలంగాణలో చాలా ముస్లిం కుటుంబాలు పేదరికంలో ఉన్నాయని, నెలకు కనీసం వెయ్యి రూపాయలు కూడా సంపాదన లేనివారుండడం బాధాకరమని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పు తెస్తామని ఎన్నికల సందర్భంగా హావిూ ఇచ్చామని, వాటిని వందకు వంద శాతం అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

ముస్లింలకు బడ్జెట్‌ లో కేటాయింపులు పెంచడంతోపాటు.. షాదీ ముబారక్‌, విద్యార్థులకు హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, కాలేజీల వంటి చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. జనాభా ప్రకారం పేద ముస్లింలకు రిజర్వేషన్‌ కల్పించడానికి తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అవలంభించిన పద్ధతులను అనుసరిస్తామని ప్రకటించారు. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ నివేదిక రాగానే ముస్లింల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు.