కత్తి ఆంధ్రోడిది.. పొడిచేది మాత్రం మనోళ్లే

చంద్రబాబును కాంగ్రెసోళ్లు భుజానికెత్తుకుని వస్తున్నారు

వంద కాదు నూటారు సీట్లు గెలుస్తాం

సోనియా కడుపు ఎందుకు తరుక్కుపోతున్నది

ప్రచారంలో రూటు మార్చిన సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): కత్తి ఆంధ్రోడిది.. పొడిచేది మాత్రం మనోళ్లే .. ఇప్పుడు కెసిఆర్‌ పాపులర్‌ డైలాగ్‌ ఇది.. ఇంకా మనకు చంద్రబాబు పెత్తనం అవసరమా.. చంద్రబాబును కాంగ్రెసోళ్లు భుజానికెత్తుకుని వస్తున్నారు.. అని అంటూ కెసిఆర్‌ ప్రచారంలో పదేపదే మాట్లాడుతున్నారు. విపక్షాలను దెబ్బతీసి సెంటిమెంట్‌తో ఓట్లు రాబట్టుకునే క్రమంలో కెసిఆర్‌ ఇలాంటి డైలాగులు మాట్లాడుతున్నారు. అలాగే సర్వేలన్నీ మనకే అనుకూలమని, వంద కాదు నూటారు సీట్లు గెలుస్తామని చెబుతున్నారు. ఎక్కడికి వెల్లినా ఆ నియోజకవర్గ అభ్యర్థి గెలుస్తాడని, అతనికి మంచి భవిస్యత్‌ ఉందని, కొందరి విషయంలో పరోక్షంగా మంత్రి అవుతాడని కూడా ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో సెంటిమెంట్‌ రాజకీయాలు తెర విూదకు వస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నందుకు గాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్‌ చేసుకుని కేసీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిన్నారు. ఇప్పటికే పలు బహిరంగ సభలతో పలు నియోజకవర్గాలను చుట్టేస్తున్న కేసీఆర్‌, తన ప్రసంగాలలో చంద్రబాబును ప్రచారాస్త్రంగా చేసుకుంటున్నారు. ‘తెలంగాణపై పెత్తనం చేసే అవకాశం

మళ్లీ చంద్రబాబుకు ఇవ్వవద్దని కేసీఆర్‌ ప్రజలకు చెప్పడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నంలో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి ఉండకూడదన్న పట్టుదలతో కేసీఆర్‌ అడుగులు వేసారు. ఆ పార్టీ నుంచి గెలిచిన అనేకులను నయానో .భయానో టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఈ దశలో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్‌ జట్టు కట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ప్రచార సభలలో విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్టేనన్న అభిప్రాయాన్ని ఓటర్లలో సెంటిమెంట్‌ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కటే తెలంగాణ ప్రజల సొంత పార్టీ అనీ, మిగతా పార్టీలన్నీ పరాయి పార్టీలన్న భావనను ప్రజల్లో వ్యాపింపజేస్తున్నారు. తెలంగాణకు మేమే బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్న లెవల్లో ప్రచారం సాగుతోంది. 2014 ఎన్నికలలో తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించడం ద్వారా రాష్ట్రంలో అధికారాన్ని హస్తగం చేసుకున్న కెసిఆర్‌ ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్‌ను ఆధారం చేసుకుని ప్రచారం చేస్తున్నారు. మళ్లీ ఆంద్రా పెత్తనం అన్న ఊతపదాన్ని బాగా వాడుతున్నారు. అయితే తెలంగాణ ప్రజల్లో చంద్రబాబుపై ఏమాత్రం వ్యతిరేకత ఉందన్నది ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తాయి. అయితే కాంగ్రెస్‌ తెలివితక్కువ నిర్ణయాల కారణంగా తెలంగాణ ఇచ్చినా ప్రచారం చేసుకునే ఎత్తులు వేయలేకపోయింది. కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌, నాలుగున్నరేళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్‌ ఆధారంగా మరోమారు అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు.దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడటానికి కేసీఆర్‌ మాత్రమే కారణం. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు చిరపరిచితుడైన ప్రొఫెసర్‌ కోదండరాంను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బద్ధ శత్రువుగా ప్రకటించడం ద్వారా కేసీఆర్‌ ఆయనతో వైరం కొనితెచ్చుకున్నారు. గత ఎన్నికల సమయంలో రాజకీయ జేఏసీ చైర్మన్‌ ¬దాలో కోదండరాం తమ పార్టీకి బహిరంగంగా మద్దతు ఇవ్వకపోగా, కాంగ్రెస్‌ పార్టీకి లోపాయికారీగా సహకరించా రన్నది కేసీఆర్‌ అనుమానం. దీంతో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కోదండరాంపై ఆయన కక్షగట్టారు. అంతిమంగా తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టిన కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి కూడా కోదండరాం సిద్ధపడే పరిస్థితి వచ్చిందంటే అందుకూ కేసీఆరే కారణంగానే చూడాలి. కేసీఆర్‌ వ్యూహాన్ని పసిగట్టిన కాంగ్రెస్‌ నాయకులు ప్రతివ్యూహంగా సోనియాగాంధీని రప్పించి అంతే స్థాయిలో సెంటిమెంట్‌ను రగిలింపజేశారు. మేడ్చల్‌లో భారీ సభ నిర్వహించి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని ఆహ్వానించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. 2014 ఎన్నికలలో కేసీఆర్‌ రాజేసిన సెంటిమెంట్‌ను దీటుగా ఎదుర్కోలేకపోయామన్న భావనతో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు, ఇప్పుడు సోనియాగాంధీ ఉపన్యాసం రూపకల్పనలోనే జాగ్రత్తలు తీసుకున్నారు. ఆమె ఏమి మాట్లాడాలో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వమే సూచించింది. కాంగ్రెస్‌ నేతల అంచనాలకు మించి బహిరంగ సభ సక్సెస్‌ అయింది. సోనియాగాంధీ ఉపన్యాసానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో కాంగ్రెస్‌ నేతలు,శ్రేణులలో నూతనోత్సాహం వచ్చింది. నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ప్రచారం ప్రారంభించి నెలన్నర దాటగా… కాంగ్రెస్‌ పార్టీ సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక పూర్తిచేసుకుని ఇప్పుడే ఎన్నికల ప్రచార బరిలోకి దిగింది. సోనియా, రాహుల్‌ సభ గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో కాంగ్రెస్‌ పార్టీలో ఆత్మస్థయిర్యం పెరిగింది. నిజానికి రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దరిదాపుల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ లేదు. అలాంటి పార్టీ ఇప్పుడు క్రమంగా పుంజుకుని అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చే స్థితికి చేరుకుంది. తెలుగుదేశం, టీజేఎస్‌,

సీపీఐలను కలుపుకొని ప్రజా కూటమికి రూపకల్పన చేయడం ద్వారా తెలంగాణలో ఎన్నికల పోరులో కెసిఆర్‌కు గట్టి సవాల్‌ విసురుతోంది. తెలంగాణలో సునాయాసంగా మళ్లీ అధికారంలోకి రావలసిన కేసీఆర్‌.. ఇప్పుడు చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెసిఆర్‌ చేస్తున్న పనులు ఎంతమంచివయినా ఇంకా సెంటిమెంట్‌ను రగల్చడం, దొరహంకారం ప్రదర్శించడం మాత్రం సరికాదని గుర్తిస్తే మంచిది.