కథువా ఘటనలో లాయర్‌కు ఎమ్మా వాట్సన్ మద్దతు
లాస్‌ఏంజిల్స్,మే5(జనం సాక్షి ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్ముకశ్మీర్ కథువా ఘటనలో అత్యాచారం, హత్యకు గురైన ఎనిమిదేళ్ల బాలిక కేసులో వాదిస్తున్న న్యాయవాదికి ప్రముఖ బ్రిటిష్ నటి, హ్యారీ పోటర్ ఫేమ్ ఎమ్మా వాట్సన్ మద్దతుగా నిలిచారు. శుక్రవారం ఆమె ఈ మేరకు ట్వీట్ చేశారు. కథువా బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తున్న న్యాయవాది దీపికా సింగ్ రజావత్‌కు మద్దతు తెలుపుతూ ఎమ్మా ట్వీట్ చేశారు. న్యాయవాది దీపికా సింగ్‌కి సంబంధించి ప్రచురితమైన ఓ ఆర్టికల్ షేర్ చేస్తూ.. ‘ఆల్ పవర్ టూ దీపికా సింగ్ రజావత్’ అని పేర్కొన్నారు. ఎమ్మా వాట్సన్ ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో మహిళా అంబాసిడర్‌గా ఉన్నారు. మహిళల సాధికారిత కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మా ట్విటర్‌లో షేర్ చేసిన ఆర్టికల్‌లో న్యాయవాది దీపికా సింగ్ రజావత్ పట్టుదల, ప్రొఫెషనల్‌గా ఆమె ప్రవర్తించే తీరు గురించి వివరించారు. కథువా కేసు వాదిస్తున్నందుకు దీపికా సింగ్‌కు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామని హెచ్చరించారు. కానీ ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ బెదిరింపుల నేపథ్యంలో కోర్టు ఆమెకు భద్రత కల్పించింది. జమ్ముకశ్మీర్‌లోని కథువాలో రసానా గ్రామంలో కొందరు దుండగులు ఎనిమిదేళ్ల బాలికను వారం రోజుల పాటు బంధించి అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం దారుణంగా చంపేసి మృతదేహాన్ని సవిూపంలోని అడవిలో పడేశారు. జనవరి 17న ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణ జరుగుతోంది.
—-