కదన కుతూహలంతో కొనసాగుతున్న సమరదీక్ష
హైదరాబాద్, జనవరి 27 (జనంసాక్షి) :
తెలంగాణ సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు టీ జేఏసీ చేపట్టిన సమరదీక్ష కదన కుతూహలంతో కొనసాగుతుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆలస్యంగా అనుమతి ఇవ్వడంతో తెలంగాణవాదులు దీక్ష ప్రారంభించారు. సుమారు రెండు వేల మందికి పైగా దీక్షకు తరలివచ్చారు. దీంతో ఇందిరాపార్క్ ఆవరణ జన సందోహంతో నిండిపోయింది. తెలంగాణపై నెల రోజుల్లోగా తేల్చేస్తామని మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో సమాధి కడుతామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ హెచ్చరించారు. ఆజాద్ మీడియా సమావేశం, షిండే ప్రకటన అనంతరం ఆయన సమర దీక్షలో మాట్లాడారు. తెలంగాణకు కాంగ్రెస్ మోసం చేయడం ఇదే మొదటిసారి కాదని నాలుగు దశాబ్దాలుగా ఇదే తీరుగా వ్యవహరిస్తుందన్నారు. ఇక్కడి ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని బలంగా కోరుకుంటున్నా కాంగ్రెస్ అధిష్టానం గుప్పెడు మంది సీమాంధ్ర పెట్టుబడిదారులకు ప్రాధాన్యం ఇస్తోందని, అలాంటి పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తీరు మార్చుకుంటుందని ఆశించామని కానీ ఆ పార్టీ బుద్ధి కుక్కతోక వంకరే అన్న చందంగానే ఉందన్నారు. తెలంగాణ ప్రజలు సంయమనంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సీమాంధ్రుల ఆర్థిక మూలాలపై దెబ్బకొడితే తప్ప వారి దురాగతాలకు అంతం ఉండదన్నారు. తెలంగాణపై ఎన్ని రోజులు చర్చలు జరుపుతారో కాంగ్రెస్ అధిష్టానం తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ పూటకో మాట చెబుతూ పబ్బం గడుపుతోందని ఆరోపించారు. సీమాంధ్ర ప్రజలు తెలంగాణకు వ్యతిరేకం కాదని, పిడికెడు మంది పెట్టుబడిదారులే వ్యతిరేకమన్నారు. శత్రువులపై ప్రయోగించాల్సిన భాష్పవాయుగోళాలు ఉస్మానియా
వర్సిటీ విద్యార్థులపై ప్రయోగించడం ఏమిటంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని సమాధి చేసేందుకు, అధిష్టానానికి వత్తాసు పలుకుతున్న మంత్రులను తరిమికొట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. శాంతియుతంగానే మిలిటెంట్ పోరాటాన్ని సాగించి తెలంగాణ సాధించుకుంటామని తేల్చిచెప్పారు.