కన్నీటి రాజధాని వద్దు

4

– బలవంతపు భూసేకరణపై పోరు

– జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌

హైదరాబాద్‌ ఆగష్టు 23 (జనంసాక్షి):

రాజధాని గ్రామాల్లో బలవంతపు భూసేకరణ చేపడితే తాను ధర్నా చేస్తానని సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పచ్చదనంతో కూడిన గ్రామాల్లో భూములను బలవంతంగా తీసుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములను ఇష్టపడి ఇస్తే తీసుకోవాలని… అంతేతప్ప బలవంతంగా లాక్కోవద్దన్నారు. ఇజ్రాయిల్‌ సాంకేతికతో రాష్ట్రంలో పంటలు పండిస్తున్నామని… ఆ టెక్నాలజీ లేకుండానే పంటలు పండుతున్న భూములను నాశనం చేయొద్దన్నారు.

రాజధాని గ్రామాల రైతుల సమస్యలు వినేందుకు తాను సినీనటుడు, రాజకీయ నాయకుడిగా రాలేదని… తోటి రైతుగా వచ్చానని పవన్‌కల్యాణ్‌ అన్నారు. తనకు చిన్ననాటి నుంచి రైతు కావాలన్నదే కోరికగా ఉండేదని తెలిపారు. గుంటూరు జిల్లాలోని పెనుమాకలో రాజధాని గ్రామాల రైతులతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులు తమ సమస్యలను పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

చంద్రబాబు ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు

తాను చంద్రబాబు ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవడానికి ఇక్కడకు రాలేదని.. సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటే గొడవ పెట్టుకోవడానికి తాను సిద్ధమేనన్నారు. తాను ఎప్పుడూ ఒకేలా మాట్లాడుతానని.. మాట మార్చడం తెలియదన్నారు. పద్ధతి లేకుండా రాష్గాన్ని విభజించడం వల్లే రాష్ట్రం ప్రస్తుతం సమస్యలతో కొట్టుమిట్టాడుతోందన్నారు. వైఎస్‌ చేసిన భూసేకరణ తప్పయితే… ఇప్పుడు చేసే బలవంతపు భూసేకరణే కూడా తప్పేనని వ్యాఖ్యానించారు.

బానిసలా బతకలేను

కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగానే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా, తెదేపాలకు మద్దతిచ్చానని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. మిత్రపక్షం అయినంత మాత్రాన బానిసలా బతకడం తనకు చేతకాదన్నారు. అన్యాయం అని తోచిన ప్రతీదానిపైనా తాను పోరాటానికి సిద్ధమేనని పేర్కొన్నారు. భూసేకరణ వల్ల రైతులకు నష్టం కలుగుతుందని తాను ఎంతో మర్యాదగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే మంత్రులు మాత్రం తనపై విమర్శలు చేశారని గుర్తు చేశారు. తాను అభివృద్ధికి అడ్డుపడుతున్నానని ప్రచారం చేస్తున్నారని… అభివృద్ధికి అడ్డుపడేవాడినే అయితే తెలుగుదేశం పార్టీకి ఎందుకు మద్దతిస్తానని పవన్‌ ప్రశ్నించారు.

ప్రజల కోసం అన్నయ్య మనసు గాయపరిచా

రాష్గానికి అనుభవం ఉన్న నాయకులు కావాలన్న ఉద్దేశంతోనే ఎన్నికల్లో తెదేపాకు మద్దతిచ్చినట్లు పవన్‌కల్యాణ్‌ తెలిపారు. రాజకీయాల్లో తాను ఏ పక్షమూ కాదని.. ప్రజల పక్షమే ఉంటానన్నారు. తండ్రి తర్వాత తండ్రి అయిన అన్నయ్య చిరంజీవిని కాదని ప్రజల పక్షాన నిలబడినట్లు చెప్పారు. ప్రజల కోసం అన్నయ్య మనసు గాయపరిచానన్నారు. జగన్‌ కంటే చంద్రబాబుకు ఎక్కువ అనుభవం ఉందని నమ్మానని.. ఇప్పటికీ నమ్ముతున్నానన్నారు. ప్రజల నుంచి సేకరించకుండానే గొప్ప రాజధాని కట్టుకునేంత భూమి రాష్ట్రంలో ఉందని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.