కన్సల్టెన్సీల పేరుతో.. 

వందల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం
చంద్రబాబు వ్యవసాయాన్ని దండుగలా మార్చారు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతువిభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి
విజయవాడ, జూన్‌13(జ‌నం సాక్షి) : కన్సల్టెన్సీల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వందల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతువిభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయశాఖ, కేపీఎంజీ ఏజెన్సీని కన్సల్టెంట్‌గా నియమించిందని, రైతులకు కనీసం సలహాలు, సూచనలు ఇవ్వలేని ఒక ప్రైవేట్‌ ఏజెన్సీకి కోట్ల రూపాయలను ఎలా చెల్లిస్తారంటూ నిలదీశారు. చంద్రబాబుకు దోచుకోవడం అలవాటైపోయిందని, గతంలో ఇదేవిధంగా మెకన్సీ సంస్థకు ఇలాగే ఇచ్చారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో ఏళ్ల అనుభవం ఉన్న శాష్తవ్రేత్తలు, ఇంజినీర్లు ఉండగా ఏజెన్సీలకు కట్టబెట్టడం దారుణమని, కేవలం కవిూషన్ల కోసమే బాబు ఈ పనులకు పూనుకున్నారని విమర్శించారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో వ్యవసాయం పండుగలా సాగిందని, కానీ చంద్రబాబు పాలనలో దండుగలా మారిందని నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎప్పుడూ బాబు భజన చేసే మంత్రి సోమిరెడ్డి రైతు సమస్యల గురించి ఎప్పుడైనా చర్చించారా అని నిలదీశారు. దేశానికి వెన్నెముకగా ఉన్న రైతు మద్దతు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారికి అందాల్సిన మద్దతు ధర గురించి ఎప్పుడైనా కేంద్రాన్ని నిలదీశారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు, సోమిరెడ్డిలకు రైతు ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని దుయ్యబట్టారు. నాలుగేళ్లపాటు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు ఏం చేశారని నాగిరెడ్డి నిలదీశారు. కేపీఎంజీ చరిత్ర బయటకు తీస్తే లోకేష్‌, సోమిరెడ్డి పేర్లు బయటికి వస్తాయని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందంటూ ప్రశ్నించారు. రాష్ట్ర వృద్ధి రేటు బాగుందని చంద్రబాబు ప్రభుత్వం డప్పు కొట్టుకుంటోందని, అంత బాగుంటే అంతర్జాతీయ కన్సల్టెన్సీల అవసరం ఏందుకని నిలదీశారు. బాబు ఇప్పటికైనా స్వప్రయోజనాలు విడిచిపెట్టి, రైతుల కోసం కృషి చేయాలని హితవు పలికారు.