కమలనాధుల ఉత్తరకుమార ప్రగల్భాలు
మోడీ సాధించిన అభివృద్ది మా నినాదం.. మా ఉత్తమ పురుషుడు మోడీ..అవే మా ప్రచారాస్త్రాలు అంటూ తెలుగు రాస్ట్రాల్లో బిజెపి నేతలు ఫీుంకారాలు చేస్తున్నారు. ఇవే తమ ఎన్నికల నినాదాలని..వచ్చే ఎన్నికల కోసం ఇపపటినుంచే ముందే కూస్తున్నారు. రెండు తెలుగు రాష్టాల్ల్రో పాగా వేస్తామని కూడా ధీమా పలుకులను పలుకుతున్నారు. డాంబికాలకు కూడా ఓ హద్దుండాలి. దేశవ్యాప్తంగానే కాకుండా ఉభయ తెలుగు రాష్టాల్ల్రోనూ మోడీ వ్యతిరేక పవనాలు బలంగా ఉన్నాయి. ప్రజలు నమ్మి మోడీకి ఓటేసినందుకు ప్రజలు చెంపలేసుకుంటున్నారు. లేకుంటే విబజన సమస్యలను ఓ కొలిక్కి తీసుకుని రాలేదు సరికదా.. కొత్తగా ఒరగబెట్టిందేవిూ లేదు. పాదయాత్రలు,నేతలు విసురులు, విమర్శలతోనే అధికారం వెలగెట్టాలను కుంటే ఎలా అన్న ఆలోచన కూడా చేయడం లేదు. వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు అమ్మకం తదితర అంశాలపై కనీసం పార్లమెంట్ వేదికగా చర్చించే సాహసం కూడా చేయలేని నేతలు బిజెపిలో ఉన్నారు. అధికారం ఉందికదా అని మోడీ దేశ ప్రయోజనాలు తాకట్టు పెడుతుంటే అడిగే ధైర్యం లేదు. నల్లధనం హావిూ మంటలో కలిసింది. ధాన్యం నిల్వల సంగతి మరిచారు. కొత్తగా దొడ్డువడ్లు కొనబోమని కేంద్రం తెగేసి చెప్పింది. పెట్రో,గ్యాస్ ధరల సంగతి సరేసరి. మరి ఇన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న బిజెపిని ప్రజలు ఎందుకు ఆదరించాలో చెప్పాలి. కనీసం విభజన సమస్యలు కూడా పరిష్కరించని అసమర్థతను కేంద్రం చాటుకుంది. భారీ మెజార్టీతో ఒంటరిగా పాలన చేసే అవకాశం వచ్చినా మోడీ సూటుబూటు వేసుకుని విదేశాలకు తిరగడమే తప్ప మరో ఘనకార్యం చేసిన దాఖలాలు లేవు. పెట్రో ధరలు మండిస్తు న్నాయి. రూపాయి ఏడ్చేస్తోంది. అయినా విజయాలు సాధించామని చెబితే ప్రజలు నమ్ముతారా అన్నది గమనించడం లేదు. ఏం చేశామని చెప్పుకుని ప్రజల్లోకి వెళతారో చెప్పడం లేదు. ఎదుటిపక్షం వారు ఎంతటి అసమర్థులైనా మన సమర్థత ఇది అని చెప్పుకోవడానికి బిజెపికి ఏవిూ లేదని వేరే చెప్పక్కర్లేదు. పార్టీ కోసం పనిచేసేవారికి తప్పకుండా అవకాశాలు కల్పిస్తాం. గెలుపు గుర్రాలను పరిగణనలోకి తీసుకుం టాం. ఇతర పార్టీల నుంచి వచ్చేవారికీ అవకాశాలుంటాయి. అన్నరీతిలో సాగుతున్నారు. బండి సంజయ్ పాదయాత్రలో కనీసం తెలంగాణకు ఇది చేశామని చెప్పుకునే ధైర్యం చేయడం లేదు. ఈ క్రమంలో నిజంగానే హుజూరాబాద్‌లో ప్రజలు తప్పకుండా ఆలోచన చేస్తారు. అక్కడ ఈటెలకు ఉన్న ప్రజాబలం తప్ప బిజెపికి ఏవిూ లేదని తెలుసు. అమిత్‌షా నిర్మల్ వస్తే ..బిజెసి అధికారం లోకి రాగానే విమోచనదినం నిర్వహిస్తామని హావిూ ఇవ్వడం సిగ్గుచేటు. ప్రజలకు కావాల్సింది ఇదా అన్నది ఆలోచన చేయాలి. ఎపిలో ఏమో జగన్ పాలన బాగా లేదనో..అవినీతిలో కూరుకు పోయారనో ..హిందూ మతానికి అపచారం జరిగిం దనో ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇవి ప్రచారంలో నిలిచే అంశాలు కావు. ఎందుకంటే విభజన సమస్యల పై ప్రజలు గళం ఎత్తితే వాటిని పరిష్కరించామని గట్టిగా చెప్పే దమ్ము బిజెపి నేతల్లో కనిపించడం లేదు. రాజధాని నిర్మాణంపై ఇంకా దోబూచులాడుతున్నారు. ఎపిలో బిజెపి సత్తా ఏంటో గత ఎన్నికల్లోనే తెలి సింది. ఇక తెలంగాణలో కెసిఆర్ వైఫల్యాలను ప్రచారం చేయడం ద్వారా లబ్దిపొందాలని చూస్తున్నారు. మోడీ వైఫల్యాలపై సహజంగానే ఎదుటి వారు ప్రచారం చేస్తారని గుర్తుంచుకోవాలి. ఇంటికో ఉద్యోగం.. కేజీ` పీజీ ఉచిత విద్య, ఇల్లులేని వారికి రెండు పడకగదుల ఇళ్లు, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాలు, కోటి ఎకరాల భూమి సాగు.. ఇలా ఏ హావిూలని తెరాస నెరవేర్చలేదని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారాంశాలుగా పాదయాత్రలో విమర్శలు గుప్పిస్తున్నారు. 2023లో అధికారం తమదే అని, తెరాస మోసాలు, వైఫల్యాలే మా ప్రచారాస్త్రాలు. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ
పథకాలనూ.. రాష్ట్రంలో అవినీతి, తెరాస కుటుంబపాలనను ప్రజల్లోకి తీసుకెళతామని ఊదరగొడుతున్నారు. మరో రెండేళ్ల సమయం ఉంది. తెలంగాణ అభివృద్ధిపట్ల ఎన్డీయే చిత్తశుద్ధితో పని చేసిందని బిజెపి నేతలు అంటున్నారు. పెద్ద సంఖ్యలో జాతీయ రహదారుల మంజూరు, నిరంత విద్యుత్తు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సత్వర అనుమతుల్లో కేంద్రం ఎంతో సహకరించిందని చెబుతున్నారు. కాని కడప, బయ్యారం ఉక్కు పరిశ్రమలపై మాత్రం చెప్పలేక పోతున్నారు. విశాఖ ఉక్కును ఎందుకు అమ్మాల్సి వస్తుందో చెప్పడం లేదు. విశాఖ రైల్వే జోన్ సమస్యను నాన్చుతూనే ఉన్నారు. మొత్తంగా ఈ సమస్యలు ఇలా ఉండతానే ప్రచారానికి మాత్రం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అమిత్‌షాతో తెలంగాణలో సభ నిర్వహించారు. ఇది కేవలం హుజూరాబాద్ కోసం రగిల్చిన సెంటిమెంట్ తప్ప మరోటి కాదు. మొత్తంగా రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల కసరత్తును ఇప్పటినుంచే వేగవంతం చేసింది. క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ నిర్వహించి, ప్రజాబలం ఉన్న వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టనుంది. అంటే ఇతర పార్టీల అభ్యర్థులను బలంగా ఢీకొనేందుకు ఆర్థిక బలం ఉన్నవారిని బిజెపి ఎంచుకునే ప్రయత్నాల్లో ఉంది. బీజేపీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల ముందుంచి తమ పార్టీ ప్రచార వ్యూహాలను ఖరారు చేసే ప్రణాళిక పైనే బీజేపీ నేతలు దృష్టి సారించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. నిర్మల్ తరహాలో భారీ సభలతో అదర గొట్టాలన్న యోచనలోనూ కమలనాధులు ఉన్నారు. పాదయాత్రల్లో కేంద్రమంత్రులతో పాటు ఇతర బీజేపీ పాలిత రాష్టాల్ర ముఖ్యమంత్రు లను ఈ సభలకు రప్పిస్తున్నారు. అయితే ప్రజలు కోరుకుంటున్నది ఇవేనా అన్నది ఆలోచనచేయాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో పాదయాత్రల్లో ఉన్న నేతలు అధ్యయనం చేయాలి. ప్రజలకు ఎలా చేరువ కాగలమో ఆలోచన చేయాలి. అప్పుడే బిజెపిని ప్రజలు నమ్మగలరు.