కమ్యూనిస్టులపై కవిత వ్యాఖ్యలు సరికాదు: సిపిఎం

నిజామాబాద్‌,మే4(జ‌నంసాక్షి): కమ్యూనిస్టులపై ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలను జిల్లా సిపిఎం కమిటీ ఖండించింది. కమ్యూనిస్టుల కన్నా కెసిఆర్‌  విప్లవం సాధించామని కవిత అన్నారు.  అయితే కమ్యూనిస్టుల పాత్రను ఏనాడూ భర్తీ చేయలేరని, వారిపోరాటాలను, త్యాగాలను ఎవరు కూడా పూడ్చలేరని సీపీఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్‌ పేర్కొన్నారు. అంత దమ్ముంటే ముందుగా జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించినప్పటికీ నిధులు ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలన్నారు. నిదులు విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మంచినీటి ఎద్దడికి సమృద్ధిగా నిధులు ఉన్నాయని అంటున్నా నీటి సమస్యను మాత్రం తీర్చడం లేదన్నారు. పట్టణాల్లోను ఉపాధి పనులను ప్రవేశపెట్టాలన్నారు. ఉపాధి కూలీలలకు డబ్బులు విడుదల చేశామని ప్రకటించారు కానీ, క్షేత్ర స్థాయిలో కూలీలకు డబ్బులు అందడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలని వడదెబ్బ బాధితులకు ఆర్థిక సాయం అందించాలన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కరవు నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని  పేర్కొన్నారు. రాష్ట్రం కరవు పరిస్థితులతో కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి తనకేదీ పట్టనట్లు వ్యహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే వారు లేకుండా పోయారన్నారు. పశుగ్రాసం అందించడంలో, రైతులకు రుణమాఫీ, పంట నష్టం పరిహారం ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఖరీఫ్‌కు సన్నద్ధం కావాల్సిన యంత్రాంగం కనీసం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందన్నారు. కరవు సహాయకచర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తక్షణం చర్యలకు ఉపక్రమించాలన్నారు.