కరాచీలోనే దావూద్
– ఆధారాలు సంపాదించిన భారత్ మీడియా
న్యూఢిల్లీ,ఆగస్ట్22(జనంసాక్షి):
ముంబయి బాంబు పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నారని తేలింది. ఇంతకాలం తమకు తెలియదంటూ బుకాయించిన పాక్ ఇప్పుడు నోరు వెళ్లబెట్టేలా ఆధారాలను ఇండియా సంపాదించింది. భారత నిఘావర్గాలిచ్చిన సమాచారంతో నేరుగా దావూద్ ఇంటికే ఫోన్ చేసి అతడి భార్యతో భారత విూడియా ప్రతినిధులు మాట్లాడారు. ముంబయి బాంబు పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నారని ఆయన భార్య విూడియాకు తెలిపింది. దావూద్ పాక్‌లోనే ఉన్నట్లు భారత్ పక్క ఆధారాలు సేకరించిన విషయం విదితమే. దావూద్ కరాచీలో నివాసమున్నట్లు టెలిఫోన్ బిల్లులు లభ్యమయ్యాయి. కరాచీ అడ్రస్‌తో ఉన్న దావూద్ పాస్‌పోర్టు జిరాక్స్‌ను భారత్ సంపాదించింది. ఈ ఆధారాలకు తోడు దావూద్ భార్య నోరు విప్పి.. మా ఆయన కరాచీలోనే ఉన్నాడని స్పష్టం చేసింది. దావూద్ ఇంట్లో ఉన్నాడా? దావూద్‌తో మాట్లాడవచ్చా అని అడిగిన ప్రశ్నలకు అతడి భార్య మెహజబీన్ జవాబిచ్చారు. మాట్లాడవచ్చు కానీ ఆయన నిద్రపోతున్నారని ఒకసారి, తర్వాత ఫోన్ చేయాలని మరోసారి చెప్పారు. దావూద్ ఫోన్ నెంబర్ దొరికినప్పటి నుంచీ భారత విూడియా ప్రతినిధులు ఆ నెంబర్‌కు కాల్ చేస్తూనే ఉన్నారు. చాలా ముఖ్యమైన విషయాలు రాబట్టారు. విూడియా ప్రతినిధులు జరిపిన టెలిఫోన్ సంభాషణలను జాతీయ భద్రతా సలహాదారు తీసుకోనున్నారు. ఉగ్రవాదమే ప్రధాన అజెండాగా రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల చర్చలు జరగనున్న తరుణంలో దావూద్‌పై విూడియా అందించిన వివరాలు కీలకంగా మారనున్నాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ విూడియా అందించిన వివరాలను కూడా అధ్యయనం చేయనున్నారు. దావూద్ కరాచీలోనే ఉన్నా తమ వద్ద లేడంటూ బొంకుతున్న పాకిస్థాన్ నోరుమూయించే ఆధారాలు ఆ దేశ భద్రతా సలహాదారు సర్తార్ అజీజ్‌కు అందించాలని భావిస్తున్నారు. దావూద్‌పై పాక్ ఆట కట్టించేందుకు విూడియా అందించనున్న వివరాలు ధోవల్‌కు కీలకంగా మారనున్నాయి. భారత విూడియా చైతన్యంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.