కరీంనగర్‌లో ఉన్మాది భీభత్సం

3

– తల్లిదండ్రులతో సహా పలువురిని గాయపరిచిన సైకో

– పోలీసు కాల్పుల్లో దుర్మరణం

కరీంనగర్‌,డిసెంబర్‌ 22(జనంసాక్షి): రాష్ట్రంలో సైకోలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. మంగళవారం తెల్లవారగానే సైకొ సృష్టించిన హంగామా నగర వాసులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. కరీనంగర్‌ పట్టణానికి చెందిన బల్విందర్‌ సింగ్‌ మంచి మేధావి. ఐటిలో గోల్డ్‌ మెడల్‌ సాధించి మంచి కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉద్యోగాన్ని ఐటికి పుట్టినిల్లుగా విరాజిల్లుతున్న బెంగుళూర్‌ పట్టణంలో పనిచేస్తున్నాడు. ఆయన తల్లిదండ్రులు  నగరంలోని లక్ష్మినగర్‌లో నివాసం ఉంటున్నారు. ఉదయం ఇంట్లో ఏం జరిగిందో ఏమో తెలియదు గాని ఒక్కసారిగా తన వద్ద ఉన్న తల్వార్‌ తీసి తల్లిదండ్రులను పొడిచాడు. దీంతో వారి అరుపులకు ఇరుగు పొరుగు వారు పరుగెత్తుకు వచ్చారు. వారిని చూసి బెదిరిపోయిన బల్విందర్‌సింగ్‌ ఆపడానికి వచ్చిన వారినల్లా తనవద్ద ఉన్న తల్వార్‌తో దాడిచేశారు. ఈఘటనలో సుమారు 20 మందివరకు గాయాలపాలయ్యారు. గాయాలపాలైన వారిలో నగరానికి చెందిన ఆటో డ్రైవర్‌తోపాటు ఓ కానిస్టేబుల్‌ కూడా ఉండడం విశేషం. ఈవిషయాన్ని తెలుసుకున్న వన్‌టౌన్‌ సీఐ విజయసారధి హుటాహుటిన కమాన్‌సెంటర్‌కు చేరుకున్నాడు. అప్పటికే సైకో బల్విందర్‌ సింగ్‌ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ నడిరోడ్డుపైకి వచ్చారు. వన్‌టౌన్‌ సీఐ ఎంత ప్రయత్నించినా కూడా వినకుండా తనవద్ద ఉన్న తల్వార్‌తో బెదిరిస్తూనే ఉన్నాడు. సుమారు అరగంటసేపు వేచి చూసిన సీఐ తప్పని పరిస్థితిలో బల్విందర్‌పైకి కాల్పులు జరిపాడు. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన బల్విందర్‌ సింగ్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పోందుతున్న క్రమంలో బల్విందర్‌ సింగ్‌ మరణించాడు. వాస్తవానికి బల్విందర్‌ సింగ్‌ బెంగుళూర్‌లో ఒరాకిల్‌ సంస్థలో నెలకు 18లక్షల ప్యాకేజీతో వేతనం పొందదుతున్నాడు. నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చిన బల్విందర్‌ సింగ్‌ తెల్లవారు జాముననే తండ్రి అమృత్‌సింగ్‌, తల్లి బేబీకౌర్‌లను కత్తితో పొడిచారు. వారిని తీవ్రంగా దూషిస్తూ తల్వార్‌తో బయటకు వచ్చాడు. బయట నిలిపి ఉన్న మిని వ్యాన్‌ అద్దాలు పగులగొట్టాడు. అటుగా వెల్తున్న శ్రీమన్నారాయణ అనే అటో డ్రైవర్‌ను గాయపరిచారు. ఈ పెనుగులాటలో అక్కడికి వచ్చిన పోలీసులపైకి కూడా దాడి చేశారు. ఏకంగా సీఐపైకి తల్వార్‌ విసురుతున్న క్రమంలో సీఐ నడుముకున్న గన్‌ ప్యాకెట్‌నుంచి పడిపోయింది., దానిని లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడని స్థానికులు తెలిపారు. అయితే ప్రాణాలకు తెగించిన  సీఐ గన్‌మెన్‌లు బల్విందర్‌సింగ్‌తో పెనుగులాడి గన్‌ను లాక్కున్నారు. దీంతో తనకు అడ్డు వచ్చిన గన్‌మెన్‌ను చంపేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో సీఐ విజయసారధి బల్విందర్‌ సింగ్‌పైకి కాల్పులు జరిపాడు. గాయపడిన వారందరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఒక్కసారిగా ఉన్మాదిలా ఎందుకు మారాడనే వాస్తవ విషయం మాత్రం బయటకు రాలేదు. సంఘటనా స్థలాన్ని జిల్లా అదనపు ఎస్పీ ఎల్‌ సుబ్బరాయుడు సందర్శించి వివరాలు సేకరించాడు.

కాల్పులు జరపకపోతే కానిస్టేబుల్‌ హతమయ్యేవాడే…

సంఘటనాస్థలాన్ని సందర్శించిన కరీంనగర్‌ డీఎస్పీ జె రామారావు పాత్రికేయులతో సంఘటనా స్థలంలో మాట్లాడుతూ బల్విందర్‌ సింగ్‌ మంచి సాఫ్ట్‌ వేర్‌ హెచ్‌ఓడి ఉద్యోగాన్ని వదిలేసి ఐఎఎస్‌కు ప్రిపేర్‌ అయ్యాడని అయితే అందులో విజయం సాధించక పొవడంతో విసుగుచెందిన ఆయన సైకొగా మారాడన్నారు. తల్లిదండ్రులనేకాక, సుమారు ఆరుగురిపై తల్వార్‌ తో దాడికి పాల్పడ్డాడని ఇందులో కానిస్టేబుల్‌ అలీ చిటికెన వేలు పూర్తిగా తెగిపోయి వేలాడుతుందన్నారు. అలాగే కాల్పులు జరుపకపోతే మల్లయ్య హెడ్‌ కానిస్టేబుల్‌ను హత్య చేసేవాడేనని డీఎస్పీ తెలిపారు. గత నెలరోజులుగా ఇంటి వద్దనే ఉంటున్న బల్విందర్‌ సింగ్‌ ఐఎఎస్‌ రాకపోవడంతో మానసిక రోగిగా మారాడన్నారు. అతనికి స్థానిక చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థలో చికిత్స కూడా అందిస్తున్నారని డీఎస్పీ తెలిపారు.

సంచలనం కలిగించిన ఎన్‌కౌంటర్‌

నగరంలో అది కూడా ఉదయంపూటే ఓ సైకోను నగరం నడిబొడ్డున కమాన్‌చౌరస్తా వద్ద పోలీసులు కాల్పులు జరిపిఎన్‌ కౌంటర్‌ చేసిన సంఘటన దావానంలా విస్తరించింది. ఒక్కసారిగా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో ప్రజలు ప్రజాప్రతినిదులు,అ ధికారులు కూడా ఆరాటపడ్డారు. నగరంలో సైకో ఉన్మాదిగా మారాడన్న వార్తను చాలామంది జీర్ణించుకోలేకపోయారు. ఏం జరిగిందనే విషయం తెలుసుకునేందుకు విూడియా చానళ్ల ప్రతినిధులకు ప్రింట్‌ విూడియా ప్రతినిధులకు వివిద ప్రాంతాలనుంచి ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. వాస్తవానికి జరిగిందేంటనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడ్డారు. అయితే బల్విందర్‌ సింగ్‌ ఉన్మాదిగా మారడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికి తెలియరాలేదు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఒక్కసారిగా పెరిగిన పోలీస్‌ బలగాలు

నగరంలో ప్రశాంతంగా అక్కడో చోట ఇక్కడొచోట మాత్రమే కనిపించే పోలీసులు ఈ ఘటన తర్వాత నగరంలోని ప్రధాన రహదారులపై భారీగా బలగాలను మొహరింపచేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ముందు, సంఘటన జరిగిన ప్రదేశం వద్ద వందలాది మంది పోలీసులను రంగంలోకి దింపారు. అంతేకాక సర్దార్జీల అంత్యక్రియలు జరిగే స్మశాన వాటిక స్టెడియం వద్ద కూడా భారీగానే బలగాలను మొహరింప చేశారు. ఈఘటన తర్వాత సర్దార్జీలు పోలీసులకు వ్యతిరేకంగా మారి ఏదైనా భయానక వాతావరణాన్ని సృష్టించే అవకాశాలు లేకపోలేదని గమనించిన ఓఎస్‌డీ ఎల్‌ సుబ్బరాయుడు బారీగా బలగాలను మొహరింప చేశారు. సర్దార్జీలు నివాసిత ప్రాంతంగా ఉన్న గంజ్‌, ప్రాంతం, వన్‌టౌన్‌ స్టేషన్‌ సవిూపంతోపాటు గురుద్వారా సవిూపంలో పోలీసుల బలగాలను దింపారు.