కరువుతో అల్లాడుతున్న రైతులు, జనం ఘోష పట్టదా….?

ఏ ఎమ్మెల్యే బికారిగా ఉన్నాడని లక్షలకు లక్షలు జీతాలు పెంచారు.
పారిశుద్య కార్మికులు, ఆశావర్కర్లకు వెయ్యి కూడా పెంచలేదెందుకు
వైసీపీ సూటిగా ప్రశ్న
కరీంనగర్‌,మార్చి30(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ప్రజలు, అన్నదాతలు బుక్కెడు నీటికోసం, కరువు వల్ల ఉన్నది పోయి అన్నమో రామచంద్రా అని ఏడుస్తుంటే పట్టించుకోని తెలంగాణా సర్కార్‌ నేడు రాత్రికి రాత్రి ఆఘమేఘాలవిూద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపి రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ నగేశ్‌ తీవ్రస్థాయిలో అభ్యంతరంవ్యక్తం చేశారు. బుదవారం జిల్లా మహిళా విబాగం అధ్యక్షరాలు పద్మ, యువజన నాయకుడు సంపత్‌తో కలిసి ప్రెస్‌భవన్‌లో పాత్రికేయుల సమావేశంలోడాక్టర్‌ నగేశ్‌ మాట్లాడారు. అసెంబ్లీలో కూర్చున్న ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా ఒక్క పూట తిండికిలేకుండా ఉపవాసం ఉంటున్నాడని నిరూపిస్తారా అని ప్రశ్నించారు. గ్రామాల్లో పేదలు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్‌ వర్కర్లు వేతనాలకోసం ఆర్తనాదాలు పెట్టినా, ఆందోళనలు చేసినా కూడా పట్టించుకోని కేసీఆర్‌ ఆయన ప్రభుత్వం ఇష్టమొచ్చిన రీతిలో లక్షలకు లక్షలు వేతనాలు పెంచుకోవడం దారుణమన్నారు. వేతనాల పెంపులో కూడా హేతుబద్దత లేదన్నారు. రాత్రికి రాత్రి ఇష్టమచ్చిన రీతిలో పెంచుకుని పేద ప్రజల కడుపులు కొట్టారని ఆరోపించారు. నియోజకవర్గంలో జనం ఇల్లు లేకుండా గుడిసెల్లో రోడ్లపై పడుకునే సామాన్యులు వేలాది మంది ఉన్నా కూడా పట్టించుకోని ప్రభుత్వం ఎమ్మెల్యేలు, మంత్రులకు మాత్రం పక్కాభవనాలు, స్థలాలు కేటాయించాలని ఆదేశాలు జారీ చేయడం శోచనీయమన్నారు. ఈచర్యలను వైసీపి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు తెలపాలని డాక్టర్‌ నగేశ్‌ ప్రభుత్వ బాదిత వర్గాలను కోరారు. నిన్నటికి నిన్న జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో 150 కోట్లను వెదజల్లిన టీఆర్‌ఎస్‌ ఆనిధులెలా వచ్చాయో ప్రజలకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అనేక వర్గాలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా కూడా పట్టించుకోకుండా కేవలం అధికారం ఉందికదాని అసెంబ్లీలో తీర్మాణం చేసుకోవడం బాద్యతారాహిత్యమే అవుతుందన్నారు. ఉపాధిహావిూ కూలీలకు వేతనాలు కూడా ఇవ్వలేని దుస్తితిలో ఉన్న ప్రభుత్వం వారికి మాత్రం లక్షలకు లక్షలు వేతనాలు, అలవెన్స్‌లు పెంచుకోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రజావ్యతిరేక విధానాలను మానుకోక పోతే రఆబోయే కాలంలొ ప్రజలు తగినగుణపాఠం చెపుతారని హెచ్చరించారు.