కరువు సమస్యలపై 27న మండల కేంద్రాల్లో ధర్నా: డిసిసి
నిజామాబాద్,ఏప్రిల్25: బంగారు తెలంగాణ పేరుతో ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం తప్ప టిఆర్ఎస్ చేస్తున్నదేవిూ లేదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ అన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలను టిఆర్ఎస్లో చేర్చుకోవడంతోనే సరిపోయిందన్నారు. ఇలా చేర్చుకోవడం వల్ల బంగారు తెలంగాణ సాధ్యమా అని ప్రశ్నించారు. తాగునీరు, కరువుపై దృష్టిపెట్టాలని కోరుతూ ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల పరిషత్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని అన్నారు. జిల్లా ప్రజలు అన్ని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో గెలిపిస్తే వారిని పట్టించుకోవడం లేదని అన్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు ట్యాంకర్లద్వారా నీటిని అందించాలని కోరుతున్నా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్‌లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తుంటే ఇక్కడ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ పార్టీ మారడంపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన వారు ముందుగా రాజీనామాచేస్తే మంచిదన్నారు. కనీస నైతిక విలువలు పాటించాలన్నారు. పాలేరులో దివంగత వెంకట్‌రెడ్డి భార్యను గెలిపించేందుకు సిఎం సహకరించి ఉంటే బాగుండేదన్నారు. అయితే పాలేరు ఎన్నిక నుంచే తెరాస పతనం ప్రారంభం అవుతుందని అన్నారు. గతంలో ఎక్కడైనా శాసనసభ్యుడు మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు ఏకగ్రీవంగా ఇచ్చేవారమని అన్నారు. ప్రస్తుతం తెరాస ప్రభుత్వం మానవత్వ విలువలను మంటగలిపి ఆ సంప్రదాయానికి స్వస్తి పలకడం దారుణమన్నారు. ఉద్యమ పార్టీ తెరాస ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరుగుతుందని ఆశించినా జరగడం లేదని పేర్కొన్నారు. వెనుకబడిన తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రజలు తీవ్రనీటి ఎద్దడి ఎదుర్కొంటున్నా ఎలాంటి పరిష్కారం చూపడం లేదని అన్నారు. జిల్లాలో చాలాచోట్ల తాగునీటి ఎద్దడి నివారణకు ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ కోరినా స్పందించడం లేదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. రెండు ప్రభుత్వాల కౌంట్‌డౌన్ ప్రారంభమైందని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం ప్రజల సంక్షేమం మరిచిపోయిందని అన్నారు. వడదెబ్బతో మనుషులు చనిపోతుంటే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.