కరోనా కేసుల తగ్గుముఖం
30వేలకు దిగువన కేసుల నమోదు
న్యూఢల్లీి,ఆగస్ట్10(జనం సాక్షి): దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉంది. దేశంలో తిరిగి కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విలయం నుంచి దేశం ఇప్పుడే కోలుకుంటోంది. గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న కరోనా వైరస్ కేసులు ఇప్పుడు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 30 వేలకు దిగువగా కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో దేశంలో 28 వేల 204 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు 373 మంది కోవిడ్ కారణంగా మరణించారు. మరోవైపు కరోనా రికవరీ రేటు భారీగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3 లక్షల 88 వేల 508 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు ప్రస్తుతం 97.45 శాతంగా ఉంది. గత 24 గంటల్లో దేశంలో 41 వేల 511 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకూ 51.45 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. అటు గత 24 గంటల్లో 54 లక్షల 91 వేల 647 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.